ఏపీలో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునేది అప్పుడే: మంత్రి కీలక ప్రకటన

ABN , First Publish Date - 2020-11-01T01:40:04+05:30 IST

సోమవారం(నవంబర్ 2) నుంచి ఏపీలో బడి గంటలు మోగనున్నాయి. పాఠశాలల్లో అనుసరించాల్సిన గైడ్‌లైన్స్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ ఏడాది కొల్పోయిన విద్యా సంవత్సరాన్ని కవర్ చేసుకునేలా సిలబస్

ఏపీలో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునేది అప్పుడే: మంత్రి కీలక ప్రకటన

అమరావతి: సోమవారం(నవంబర్ 2) నుంచి ఏపీలో బడి గంటలు మోగనున్నాయి. పాఠశాలల్లో అనుసరించాల్సిన గైడ్‌లైన్స్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ ఏడాది కొల్పోయిన విద్యా సంవత్సరాన్ని కవర్ చేసుకునేలా సిలబస్ రూపకల్పన చేసినట్లు తెలిపారు. కేంద్రం గైడ్ లైన్సును పాటిస్తూ పాఠశాలలను తెరుస్తున్నట్లు వెల్లడించారు. అన్ని జాగ్రత్తలతో స్కూళ్లను తెరుస్తున్నట్లు స్పష్టం చేశారు.


పెద్ద తరగతులతో ప్రారంభం....

‘నవంబర్ 2 నుంచి స్కూళ్లలో 9, 10 క్లాసులతో పాటు ఇంటర్ సెకండియర్ తరగతులను ప్రారంభిస్తాం. నవంబర్ 16 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు జరుగుతాయి. నవంబర్ 23వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులను ప్రారంభించనున్నాం. డిసెంబర్ 14 నుంచి 1-5 తరగతులు ప్రారంభిస్తాం. నవంబర్ 2 నుంచి ఆరు వారాల తర్వాత ప్రైమరీ స్కూళ్లు తెరుస్తాం. నవంబర్ 23 నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లను ప్రారంభిస్తాం. ఇప్పటికే డిగ్రీ, పీజీ తరగతుల షెడ్యూల్ ఇచ్చాం. 2020-21 విద్యా సంవత్సరాన్ని వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తవుతుంది. స్కూళ్ల పని దినాలు 180 రోజులు ఉంటున్నాయి. స్కూళ్లకి సంబంధించిన అకాడమిక్ ఇయర్ వచ్చే ఏడాది ఏప్రిల్ నెలతో ముగిసేలా చర్యలు’ తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.


అన్ని చర్యలు తీసుకున్నాం..

‘శానిటైజేషన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తల్లిదండ్రులు ఆందోళన పడకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. సామాజిక దూరం, మాస్కుల ధారణ కంపల్సరీ. ఇంటర్మీడీయేట్ అడ్మిషన్లల్లో ఎలాంటి గందరగోళం లేదు. అవసరమైనన్నీ సీట్లు ఇంటర్మీడీయేట్‌లో ఉన్నాయి. 5,83,740 ఇంటర్మీడీయేట్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి పాస్ అయిన వారికి సరి సమానంగా ఇంటర్మీడీయేట్‌లో సీట్లున్నాయి. సీట్ల కోసం అదనంగా కొత్త 153 కాలేజీలకు అనుమతులిచ్చాం’ అని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.


అలాంటి కాలేజీలకు అనుమతివ్వం..

‘రేకుల షెడ్డుల్లో కాలేజీలు రన్ చేస్తే చూస్తూ ఊరుకోవాలా..? అందుకే కొన్ని కాలేజీలకు అనుమతులను రెన్యూవల్ చేయలేదు. విద్యా సంస్కరణల్లో భాగంగా పేరు గొప్ప ఊరు దిబ్బ కాలేజీలకు అనుమతివ్వలేదు. 611 కాలేజీలకు అనుమతులను రద్దు చేశాం. విద్యా సంస్కరణలకు అనుకూలంగా విద్యార్ధి సంఘాలు.. తల్లిదండ్రులు రోడ్ మీదకు వచ్చాయి. షెడ్లల్లో, షాపింగ్ కాంప్లెక్సుల్లో నడిపే కాలేజీలపై కనికరం చూపం. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటిస్తూ ఇంటర్మీడీయేట్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు ఇస్తున్నాం. ఫీజులను కూడా 30 శాతం తగ్గించాలని ఆదేశించాం’ అని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2020-11-01T01:40:04+05:30 IST