Covid కేసులు పెరుగుదలపై భయాందోళన వద్దు

ABN , First Publish Date - 2022-01-20T13:30:03+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు. స్థానిక స్టాన్టీ ప్రభుత్వాస్పత్రిలో నూతనంగా చేతి మార్పిడి శస్త్రచికిత్స

Covid కేసులు పెరుగుదలపై భయాందోళన వద్దు

- ధైర్యంగా ఉండండి

- ప్రజలకు మంత్రి సుబ్రమణ్యం హితవు


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు. స్థానిక స్టాన్టీ ప్రభుత్వాస్పత్రిలో నూతనంగా చేతి మార్పిడి శస్త్రచికిత్స విభాగాన్ని బుధవారం మంత్రి సుబ్రమణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పొంగల్‌ సందర్భంగా ఐదు రోజులు వరుస సెలవులు రావడంతో నగరం నుంచి సుమారు 8 లక్షల మంది ప్రజలు సొంతూళ్లకు వెళ్లి తిరిగొచ్చారన్నారు. దీంతో, కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా, ఒమైక్రాన్‌ కేసులు అధికంగా ఉన్న ఏరియాలను గుర్తించి 3787 ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించినట్లు ఆయన వివరించారు. కరోనా బాధితులకు అందజేసేందుకు అన్ని వసతులతో కూడిన వార్డులు, ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.92 లక్షల పడకలు సిద్ధం చేయగా, ప్రస్తుతం 9 వేల మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని తెలిపారు. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు అదనపు ఛార్జీ వసూలుచేస్తే ‘104’ నెంబరుకు ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచించారు. ‘నీట్‌’ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి అమిత్‌ షాకు రాష్ట్రానికి చెందిన అఖిలపక్ష ఎంపీల బృందం చేసిన విజ్ఞప్తి, రాష్ట్రానికి అనుకూలంగా ప్రకటన వెల్లడయ్యే అవకాశముందని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.


పెరిగిన ఆక్సిజన్‌ ఆధారిత బాధితుల సంఖ్య...

కరోనా లక్షణాలకు గురై ఆక్సిజన్‌ అవసరమైన బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఈ నెల 1వ తేది కరోనా బాధితుల సంఖ్య 8,340 ఉండగా, 17వ తేది ఈ సంఖ్య 1,52,348కి చేరింది. బాధితుల్లో 814 మంది ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో అత్యధికంగా చెన్నైలో మాత్రమే 291 మంది ఉండగా, కోయంబత్తూర్‌లో 72, సేలంలో 68, వేలూరులో 51, మదురైలో 49 మంది ఉన్నారు. ఈ నెల 1వ తేదీ ఆక్సిజన్‌ అవసరమైన బాధితుల సంఖ్య 1,392 ఉండగా, 17వ తేది వారి సంఖ్య 4,013కు పెరిగింది. వారిలో చెన్నైలో 1,407 మంది, కోవైలో 499, మదురైలో 291, వేలూరులో 193, సేలంలో 149 మంది బాధితులున్నారు.


చెన్నైలో 387 వీధుల మూసివేత...

రాజధాని నగరం చెన్నైలో కొద్దిరోజులుగా కరోనా కేసులు అధికమవుతున్నాయి. చెన్నై కార్పొరేషన్‌ పరిధిలోని 15 మండలాల్లో తేనాంపేట, కోడం బాక్కం, అడయార్‌, అన్నానగర్‌ మండలాల్లో కేసుల సంఖ్య అధికమవుతోంది. కొవిడ్‌ బాధితులను గుర్తించి వారికి సత్వరం చికిత్స అందించేలా ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. పాజిటివ్‌ నిర్ధారణ అయి, స్వల్ప లక్షణాలున్న వారిని వారం రోజులు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో 58 వేల మందికి పైగా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వారిలో 71 శాతం మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 39,537 వీధులుండగా, వాటిలో 3 నుంచి ఆరుగురు బాధితులున్న వీధులు 1,850, 6 నుంచి పదిమంది బాధితులున్న వీధులు 729 ఉన్నాయి. అలాగే, 10 నుంచి 25 మంది బాధితులున్న 387 వీధులను మూసివేసి, అక్కడ ఎలాంటి వాహనాలను అనుమతించడలేదని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-01-20T13:30:03+05:30 IST