Minister Sri ramulu భూకబ్జాదారుడు

ABN , First Publish Date - 2022-05-15T18:38:39+05:30 IST

రాష్ట్ర రవాణాశాఖ, బళ్లారి జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీ శ్రీరాములు అధికార బలంతో బళ్లారిలో 27.25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని సమాజ పరివర్తన

Minister Sri ramulu భూకబ్జాదారుడు

- బళ్లారిలో 27.25 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ

- అధికారుల అండతో రిజస్ట్రేషన్‌ 

- సమాజ పరివర్తన సముదాయ నాయకుడు హెచ్‌ఆర్‌ హిరేమఠ్‌ 


బళ్లారి(బెంగళూరు): రాష్ట్ర రవాణాశాఖ, బళ్లారి జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీ శ్రీరాములు అధికార బలంతో బళ్లారిలో 27.25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని సమాజ పరివర్తన సముదాయ నాయకుడు ఎస్‌ఆర్‌ హిరేమఠ్‌ ఆరోపించారు. ఆయన హుబ్బళ్లిలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బళ్లారిలో కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం రిజర్వు చేసిన స్థలం 10 ఎకరాలు, పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి మరో 17.25 ఎకరాలను శ్రీరాములు అక్రమించారని ఆరోపించా రు. తన అధికార బలంతో అధికారులను అడ్డుపెట్టుకుని రిజిస్టర్‌ చేయించుకున్నట్లు హిరేమఠ్‌ పేర్కొన్నారు. రిజిస్ర్టేషన్‌ రికార్డులు, భూమికి సంబంధించిన వివరాలన్నీ సేకరించామని తెలిపారు. కోర్టులో కూడా వీటిపై పిటీషన్‌ వేసినట్లు వివరించారు. మంత్రి పదవి నుంచి శ్రీరాములు స్వచ్ఛందంగా తప్పుకోవాలని లేనిపక్షంలో న్యాయపోరాటం చేస్తామని ఆయన తెలిపారు. వీటితోపాటు డీఎంఎఫ్‌ ఫండ్‌ను కూడా మంత్రి ఇతర అవసరాలకు వాడడం సమంజసం కాదన్నారు. డీఎంఎఫ్‌ ఫండ్‌ను కేవలం ప్రజల అవసరాలకే వాడాలని కోరారు. శ్రీరాములు ఆక్రమించిన భూమిని ప్రభుత్వానికి తనే తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రజాఉద్యమం చేస్తామని హిరేమఠ్‌ హెచ్చరించారు. బళ్లారిలో త్రిమూర్తులు అయిన గాలి జనార్దన్‌రెడ్డి, గాలి కరుణాకర్‌రెడ్డి, బీ శ్రీరాములు ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆయన పేర్కొన్నారు. 



Updated Date - 2022-05-15T18:38:39+05:30 IST