నిత్యావసరాల రవాణాకు ఇబ్బందిలేదు

ABN , First Publish Date - 2020-03-29T10:21:26+05:30 IST

జిల్లాలో నిత్యావసర సరకుల రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

నిత్యావసరాల రవాణాకు ఇబ్బందిలేదు

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు


విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిత్యావసర సరకుల రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జీవీఎంసీ సమావేశ మందిరంలో శనివారం ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండేలా చైతన్యం కల్పించాలని కోరారు. నిత్యావసరాలకు కొరత లేదని, రవాణాకు ఎక్కడైనా సమస్య ఉంటే సంబంధిత అధికారులు తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు.


పారిశుధ్య నిర్వహణకు బ్లీచింగ్‌ పౌడర్‌ కొరత ఉందని కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా, జీవీఎంసీ వద్ద 30 టన్నుల సరకు సిద్ధంగా ఉందని కమిషనర్‌ సృజన తెలిపారు. కలెక్టర్‌ వినయ్‌చంద్‌ కోవిడ్‌-19 ఆస్పత్రులు, వాటిలో ఉన్న సదుపాయాలను వివరించారు. ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ మాట్లాడుతూ ప్రతీ రేషన్‌ దుకాణం వద్ద జనం రద్దీ లేకుండా ఉండేందుకు ఒక వలంటీర్‌ను ఉంచుతామన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బి.సత్యవతి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-29T10:21:26+05:30 IST