రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని

ABN , First Publish Date - 2022-01-17T08:18:53+05:30 IST

శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల శ్రీశ్రీశ్రీ తిదండి చినజీయర్‌ స్వామి ట్రస్ట్‌ ఆశ్రమంలో భగవత్‌ రామానుజుల స్వామి భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ,

రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని

వేడుకల్లో పాల్గొననున్న రాష్ట్రపతి, సీఎం కేసీఆర్‌

ప్రపంచ పర్యాటక కే ంద్రంగా విగ్రహ ప్రాంతం

హైదరాబాద్‌/శంషాబాద్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల శ్రీశ్రీశ్రీ తిదండి చినజీయర్‌ స్వామి ట్రస్ట్‌ ఆశ్రమంలో భగవత్‌ రామానుజుల స్వామి భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్‌, సీఎం కేసీఆర్‌ త్వరలో ఆవిష్కరిస్తారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రామానుజుల విగ్రహ ప్రతిష్ఠతో ఈ ప్రాంతం ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఆదివారం ముచ్చింతల్‌ ఆశ్రమాన్ని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో కలిసి సందర్శించారు. ఆశ్రమంలో ఏర్పాట్లను, రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆశ్రమంలోని దేవాలయాన్ని సందర్శించి సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రపంచంలోనే రామానుజుల అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం విశేషమన్నారు. ప్రధాని, రాష్ట్రపతి, సీఎంల చేతుల మీదుగా అద్భుత ఆవిష్కరణలు జరుగుతాయన్నారు. ఈ భారీ విగ్రహ కేంద్రం తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తుందన్నారు. కాగా, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి శనివారం చినజీయర్‌ స్వామిని కలిశారు. స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఫిబ్రవరిలో జరిగే శ్రీరామానుజ శతాబ్ధి ఉత్సవాల కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. మంత్రి కిషన్‌రెడ్డితో పాటు మై హోమ్స్‌ అధినేత రామేశ్వరరావు పాల్గొన్నారు. 


మరో యాదాద్రిగా అలంపురం

కేసీఆర్‌ నేతృత్వంలో అలంపురం జోగులాంబ పుణ్యక్షేత్రాన్ని మరో యాదాద్రిగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. జోగులాంబ ఆలయ ఈవో పురేందర్‌ కుమార్‌, ఇతర అధికారులు మంత్రిని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఆదివారం కలిసి ఆలయ అభివృద్ధి పనులపై చర్చించారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారని తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ క్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకుల్ని ఆకట్టుకునేలా థీం పార్క్‌, వసతులు కల్పిస్తామని చెప్పారు. నదిపై తేలియాడే వంతెన, సేద తీరేందుకు అధునాతన వసతి సౌకర్యాలకు మొదటి విడతగా రూ.36 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైతే స్థానికుల సహకారం తీసుకోవాలని సూచించారు.

Updated Date - 2022-01-17T08:18:53+05:30 IST