హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ లో నిర్మించిన అతిపెద్ద బౌద్ధ క్షేత్రం బౌద్ధవనం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి త్వరలో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుద్ధవనం ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విభజన వల్ల నాగార్జున కొండను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడంతో తెలంగాణ నుండి వెళ్లే పర్యాటకులకు ఆంక్షలు, అడ్డంకులు ఆ రాష్ట్ర అధికారులు సృష్టిస్తున్నారని అన్నారు.నాగార్జున కొండకు సమాంతర బుద్ధిజం చరిత్ర నేపథ్యం కలిగిన చాకలి గట్టు ఐలాండ్ అభివృద్దికి డీపీఆర్ లను రూపోందించి సీఎం కేసిఆర్ తో అమోదం తీసుకొని పర్యాటకంగా, చారిత్రకంగా అభివృద్ధి చేసేందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేసి బుద్ధవనం ప్రాజెక్టు తో పాటు చాకలి గట్టును కూడా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో బుద్ధవనం ప్రాజెక్టు, మన్యంకొండ దేవాలయం, ప్రముఖ బుద్ధిజం కేంద్రాలైన నేలకొండపల్లి, ఫణిగిరి ల వద్ద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పనుల పురోగతి పై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రక మన్నెంకొండ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం వద్ద నూతనంగా నిర్మించ తలపెట్టిన అర్కయాలజీ మ్యూజియం ఏర్పాటు కు డీపీఆర్ లు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలైనా నేలకొండపల్లి, ఫణిగిరి బౌద్ధ క్షేత్రాల వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహా నగరంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా సుమారు 25 నుండి 30 ఎకరాల విస్తీర్ణంలో దేశం గర్వించదగ్గ మ్యూజియం ను నిర్మించేందుకు అవసరమైన డీపీఆర్ లను రూపొందించి కేంద్ర పురావస్తు శాఖ కు పంపేందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, చరిత్ర కారులు శివనాగి రెడ్డి, బుద్ధవనం ఓఎస్డి సుభాన్ రెడ్డి లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి