తెలంగాణలో సమగ్ర పర్యాటకాభివృద్ధికి చర్యలు: శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2021-10-30T01:59:18+05:30 IST

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సమగ్ర పర్యాటకాభివృద్ధి తో పాటు సాంస్కృతి, సాంప్రదాయ కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత లభిస్తోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

తెలంగాణలో సమగ్ర పర్యాటకాభివృద్ధికి చర్యలు: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సమగ్ర పర్యాటకాభివృద్ధి తో పాటు సాంస్కృతి, సాంప్రదాయ కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత లభిస్తోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పర్యాటకుల సౌకర్యం కోసం, దేశంలోని పర్యాటక ప్రదేశాల విశిష్టత, ప్రాముఖ్యత తో పాటు తగిన సమాచారం ను అందించేందుకు డిజిటల్ యాప్ ను అన్ని  భాషల్లో రూపొందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పర్యాటక శాఖలో పనిచేస్తున్న టూరిస్ట్ గైడ్ లకు మెరుగైన స్కిల్స్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇచ్చి వారికి గుర్తింపు కార్డులను జారీ చేయాలని మంత్రి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఉన్నత అధికారులకు సూచించారు. అంతేకాకుండా టూరిస్ట్ గైడ్ లకు గౌరవ వేతనాన్ని ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు.కోవిడ్ మహమ్మారి కారణంగా పర్యాటక, అతిధ్య రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. 


ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పర్యాటకం మళ్ళీ పుంజుకోవటానికి, దేశ విదేశ మార్కెట్లలో ఇతర రాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి ఎయిర్ పోర్ట్ లలో  ప్రచారం చేసుకొనేందుకు అవసరమైన వెసులుబాటు కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బెంగుళూరు లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రుల సమావేశంలో రెండో రోజు ప్రొహిబిషన్ ఎక్సైజ్, క్రీడ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి హోదాలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో మంత్రి  శ్రీనివాస్ గౌడ్ కేంద్ర పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రూపెంధర్ బ్రార్ లతో దక్షిణ తెలంగాణ రాష్ట్రం లో ప్రముఖ దేవాలయం మన్యం కొండ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ అభివృద్ధి పై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 


మన్యం కొండ దేవాలయం అభివృద్ధి పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. మన్యం కొండ దేవాలయం కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులతో పాటు రాయచూరు కు దగ్గరగా ఉండటంతో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు, పర్యాటకులు తరలివస్తున్న నేపథ్యంలో  పర్యాటకుల సౌకర్యాలు, దేవాలయం అభివృద్ధి తో పాటు రోప్ వే , లేక్ ఫ్రంట్ అభివృద్ధి, పర్యాటకుల మౌలిక సదుపాయాల కల్పన కోసం 50 కోట్ల రూపాయల కేటాయింపు ప్రతిపాదనల పై కూడా ఈ సమావేశంలో మంత్రి చర్చించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. 

Updated Date - 2021-10-30T01:59:18+05:30 IST