రామప్ప దేవాలయానికి వారసత్వ హోదాకు కృషి: శ్రీనివాస్‌గౌడ్‌

ABN , First Publish Date - 2021-07-23T00:55:50+05:30 IST

రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదాను సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో వేగవంతమైన నిర్ణయాలను సత్వర చర్యలను చేపట్టిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.

రామప్ప దేవాలయానికి వారసత్వ హోదాకు కృషి: శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదాను సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో వేగవంతమైన నిర్ణయాలను సత్వర చర్యలను చేపట్టిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఈనెల 25వ తేదీన జరగబోయే సమావేశంలో ప్రపంచ వారసత్వ కమిటీ సభ్యులందరి సమ్మతిని పొందేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. గురువారం రవీంద్రభారతిలోని మంత్రి మీడియాతో మాట్లాడారు. ఐసిఔంఔస్‌ (అంతర్జాతీయ చారిత్రక కట్టడాలు, ప్రదేశాల మండలి) రామప్పకు వారసత్వహోదాను మూల్యాంకనం చేసి కొన్నిసూచనలు చేసింది. రామప్ప దేవాలయానికి కొద్ది దూరంలో ఉన్న రెండుచిన్న దేవాలయాలను కూడా రామప్ప దేవాలయ ఆస్తి పరిధిలోకి తీసుకోవాలని సూచించింది. 


ఈ మేరకు ములుగు జిల్లా కలెక్టరు ఆ రెండు చిన్నదేవాలయాలు ఉన్న భూమిని రామప్ప దేవాలయానికి అందజేస్తూ అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేశారని , దీని వల్ల భారతీయ పురావస్తు సర్వేక్షణ సంస్ధ వారు రామప్ప దేవాలయ సరిహద్దులను ఐసిఔంఔస్‌ సూచనలకు అనుగుణంగా మార్పులుచసినట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ వారసత్వ శాఖ కూడా రామప్ప పరిసర ప్రాంతాల్లోని ప్రాచీన కట్టడాల పరిక్షణ ప్రణాళిక (సిఎంపి), పర్యాటక అభివృద్ధి వంటి అంశాల సక్రమ అమలుకోసం రాష్ట్రస్ధాయిలో వివిధ శాఖలతో సమన్వయ కమిటీని ఏర్పాటుచేసిందని అన్నారు. దీనిలో కేంద్ర పురావస్తుశాఖ, దేవాదాయశాఖ, నగర ప్రణాళిక, నీటి పారుదల శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారని అన్నారు. కమిటీకి అధ్యక్షుడిగా ప్రభుత్వ పర్యాటక కార్యదర్శి వ్యవహరిస్తారని తెలిపారు. 

Updated Date - 2021-07-23T00:55:50+05:30 IST