ప్రజా ఆరోగ్యంతో మంత్రి శంకర్ నారాయణ చెలగాటం

ABN , First Publish Date - 2020-10-31T20:43:15+05:30 IST

అతను ఒక రాష్ట్రానికి మంత్రి, నలుగురికి చెప్పాల్సిన నేత, కానీ

ప్రజా ఆరోగ్యంతో మంత్రి శంకర్ నారాయణ చెలగాటం

అనంతపురం : అతను ఒక రాష్ట్రానికి మంత్రి, నలుగురికి చెప్పాల్సిన నేత, కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న టైమ్‌లో సమావేశాలను పెట్టి వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన మరెవరో కాదండోయ్ ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ. కరోనా టైమ్‌లో అప్రమత్తంగా ఉండాలని సమావేశాలు పెట్టి ప్రజలకు అవగాహన కల్పించి.. వారిని ఆదుకోవాల్సిన నేతే ఊహించని విధంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి మహమ్మారికి ఆజ్యం పోశారు. మంత్రి వ్యవహారశైలిపై జిల్లాకు చెందిన ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ మంత్రి తీరుపై జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఈ మంత్రిగారు చేసిన పనేంటో ఇప్పుడు చూద్దాం.


ఇదీ జరిగింది..!

అనంతపురం జిల్లా పెనుకొండలో మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే కనీసం భౌతిక దూరం పాటించలేదు. ఇలా ప్రజారోగ్యంతో మంత్రి చెలగాటం ఆడుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 139 బీసీ కులాలకు ప్రాతినిద్యం కల్పిస్తూ జగన్ సర్కార్ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇందుకుగాను రాష్ట్ర మంత్రి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరు కనీసం భౌతిక దూరం పాటించకపోవడమే కాదు.. మాస్క్ కూడా ధరించకపోవడం గమనార్హం. అనంతపురంలో కరోనా ఇంకా పూర్తిగా కంట్రోల్ కాలేదు. రోజుకు 150కు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మంత్రి ఇలా ర్యాలీ చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఇవేమీ పట్టవా..!?

ఇదిలా ఉంటే.. రోజురోజుకు కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దూరం పాటించి మాస్కు ధరించాలని ఆరోగ్య శాఖ పదే పదే హెచ్చరిస్తూనే ఉంది. అయితే మంత్రి మాత్రం ఇవేమీ పట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. ఒకటి రెండు కాదు సుమారు పెనుకొండ పట్టణంలో ఐదు కిలోమీటర్ల మేర ఇలా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాగా జిల్లాలో మంత్రి ఎక్కడ పర్యటించినా రైతులు అడ్డుకోవడం, గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలా పలుమార్లు వార్తల్లో నిలిచిన మంత్రి ఇప్పుడు ఏకంగా ఇలా ర్యాలీతో హాట్ టాపిక్ అయ్యారు. సోషల్ మీడియాలో, మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలపై మంత్రి శంకర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.



Updated Date - 2020-10-31T20:43:15+05:30 IST