మంత్రి శంకర్‌ మళ్లీ అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-05T14:43:16+05:30 IST

మూడు కమిషనరేట్ల పరిధిలో 260 చోరీలు చేశాడు. ఎన్నోసార్లు జైలుకెళ్లాడు. అతడిపై నాలుగు పీడీయాక్టులు కూడా నమోదయ్యాయి. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. నేరాలు ఆపలేదు.

మంత్రి శంకర్‌ మళ్లీ అరెస్ట్‌

260 చోరీలు, నాలుగు పీడీయాక్టులు

గత నెలలో జైలు నుంచి విడుదల 

అయినా మారని తీరు


హైదరాబాద్‌ సిటీ: మూడు కమిషనరేట్ల పరిధిలో 260 చోరీలు చేశాడు. ఎన్నోసార్లు జైలుకెళ్లాడు. అతడిపై నాలుగు పీడీయాక్టులు కూడా నమోదయ్యాయి. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. నేరాలు ఆపలేదు. చోరీ కేసులో మరోసారి అరెస్ట్‌ అయ్యాడు. అతడే ఘరానా దొంగ మంత్రి శంకర్‌తో పాటు ముగ్గురు అనుచరులను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైదాబాద్‌ పోలీసులతో కలిసి నిర్వహించిన జాయింట్‌ ఆపరేషన్‌లో చిలకలగూడ ప్రాంతానికి చెందిన మంత్రి శంకర్‌ (60) అలియాస్‌ శివన్న, అనుచరులు చాంద్రాయణగుట్ట నివాసి సయ్యద్‌ అసద్‌ (39), హఫీజ్‌ బాబానగర్‌ నివాసి సయ్యద్‌ మేరాజ్‌ (32), అంబర్‌పేట్‌ వాసి మహమ్మద్‌ మోయిజ్‌ ఖాన్‌ (26)లను అదుపులోకి తీసుకుని విచారించారు. 


260 చోరీ కేసులు

చిలకలగూడ ఏరియాలో పుట్టి పెరిగిన శంకర్‌ 1979 నుంచే చోరీల బాట పట్టాడు. 260 చోరీ కేసుల్లో 22 సార్లు అరెస్టు అయ్యాడు. 209 కేసుల్లో శిక్షలు పడ్డాయి. చిలకలగూడ పీఎ్‌సలో అతనిపై సీడీసీ షీట్‌ కొనసాగించడమే కాకుండా అతనిపై నిఘా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అతనిపై నాలుగు సార్లు పీడీయాక్టు నమోదైంది. గత నెల 14న జైలు నుంచి విడుదలైన మంత్రి శంకర్‌ మళ్లీ ఓ గ్యాంగును సిద్ధం చేసుకున్నాడు. పోలీసులు, తోటి నేరస్తులు కూడా సునాయాసంగా గుర్తిస్తారని భావించిన మంత్రి శంకర్‌ తాను టార్గెట్‌ చేసిన... చోరీ చేయాల్సిన బస్తీలను, ప్రాంతాలను తరచూ మారుస్తుంటాడు. అవకాశం దొరకగానే చోరీ చేయడానికి వీలుగా ఎప్పుడూ తనతో స్ర్కూడ్రైవర్‌, ఐరన్‌ రాడ్‌ పెట్టుకుని తిరుగుతుంటాడు. రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము 4 గంటల మధ్య చోరీలు చేస్తుంటాడు. ఓ కాలనీలో ప్రవేశించిన తర్వాత కాంపౌండ్‌ వాల్స్‌ ద్వారా ఓ ఇంటి నుంచి మరో ఇంట్లోకి ప్రవేశిస్తూ... ఎవరి కంట పడకుండా జాగ్రత్త పడుతుంటాడు. మూడు కమిషనరేట్లలో తాజాగా ఆరు చోరీలు చేసి మరోసారి అరెస్ట్‌ అయ్యాడు.

Updated Date - 2022-01-05T14:43:16+05:30 IST