Smart meters ఏర్పాటు తర్వాతే నెలవారీ బిల్లులు

ABN , First Publish Date - 2022-07-23T13:44:48+05:30 IST

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులందరికీ స్మార్ట్‌ మీటర్లను అమర్చిన తర్వాతే నెలవారీ విద్యుత్‌ ఛార్జీలు వసూలుచేసే పథకాన్ని అమలు చేస్తామ

Smart meters ఏర్పాటు తర్వాతే నెలవారీ బిల్లులు

                                - మంత్రి సెంథిల్‌ బాలాజి


చెన్నై, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులందరికీ స్మార్ట్‌ మీటర్లను అమర్చిన తర్వాతే నెలవారీ విద్యుత్‌ ఛార్జీలు వసూలుచేసే పథకాన్ని అమలు చేస్తామని విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌బాలాజీ తెలిపారు. పులియంతోపు ప్రాంతంలో సబ్‌ స్టేషన్‌ను శుక్రవారం ఉదయం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై అధిక భారం లేకుండా విద్యుత్‌ ఛార్జీలను స్వల్పంగానే పెంచామని, భారతదేశంలోనే విద్యుత్‌ ఛార్జీలు రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయన్నారు. డీఎంకే ఎన్నికల హామీ మేరకు యేడాదిలోగా లక్షమంది రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేశామని, ప్రస్తుతం దరఖాస్తు చేసిన రైతులందరికీ త్వరలోనే ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ యేడాది మరో 50 వేల మంది రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయనున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా ప్రతి రెండు నెలలకు ఒకమారు మీటర్‌ రీడింగ్‌ తీసి విద్యుత్‌ ఛార్జీలను వసూలు చేస్తున్నామని, గతంలా ప్రతినెలా విద్యుత్‌ ఛార్జీలు వసూలు చేసే పద్ధతిని అమలు పరచాలని ప్రధాన ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని తెలిపారు. నెలవారీ బిల్లుల విధానానికి ప్రతినెలా మీటర్‌ రీడింగ్‌ తీయాల్సి ఉందని, దానికి ప్రస్తుతమున్న ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాల్సి ఉంటుందన్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త మీటర్లు కొనుగోలుకు టెండర్లు రూపొందిస్తున్నామని, అదే విధంగా అన్ని ఇళ్ళకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు. స్మార్ట్‌ మీటర్లను బిగిస్తే మీటర్‌ రీడింగ్‌ తీయడం సులభతరమవుతుందని, దాని తర్వాతే ప్రతినెలా రీడింగ్‌ తీసి విద్యుత్‌ ఛార్జీలు వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెడతామని సెంథిల్‌బాలాజీ తెలిపారు.

Updated Date - 2022-07-23T13:44:48+05:30 IST