తగ్గించిన అంగన్ వాడీల కేంద్ర వాటాను పునరుద్ధరించండి: సత్యవతి రాథోడ్

ABN , First Publish Date - 2021-09-04T00:48:47+05:30 IST

బాలలు, బాలింతలు, గర్భిణీల సంక్షేమం కోసం తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతుంగా ఉన్నాయని, తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై ప్రశంసలు కురిపించింది.

తగ్గించిన అంగన్ వాడీల కేంద్ర వాటాను పునరుద్ధరించండి: సత్యవతి రాథోడ్

ఢిల్లీ: బాలలు, బాలింతలు, గర్భిణీల సంక్షేమం కోసం తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతుంగా ఉన్నాయని, తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై ప్రశంసలు కురిపించింది. ఇప్పటికే అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక మోడల్ గా మారింది. తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సమగ్ర అభివృద్ధి కోసం  చేపడుతున్న బాలామృతం, గ్రోత్ మానిటరింగ్ స్పెషల్ డ్రైవ్(పిల్లల పెరుగుదల నమోదు ప్రత్యేక కార్యక్రమం) చాలా బాగున్నాయని, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కొనియాడారు. తెలంగాణలో అందిస్తున్న బాలామృతానికి అనేక రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉందని, దీని ఉత్పత్తని మరింత పెంచి ఇతర రాష్ట్రాలకు ఇవ్వడం కోసం కావాల్సిన సాయాన్ని కేంద్రం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. 


కేంద్ర ప్రభుత్వం దేశంలోని చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం చేపట్టిన వివిధ పథకాల గడువు ముగుస్తుండడం, వాటి కేంద్ర వాటా తగ్గించడం, కొనసాగించకపోవడంపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ మేయర్ గుండు సుధారాణి, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఢిల్లీలో కలిసి ప్రారంభించిన కేంద్ర పథకాలను కొనసాగించాలని, గతంలో మాదిరిగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను భరించాలని విజ్ణప్తి చేశారు. ఈ కింద విషయాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 


1. పిల్లలు, బాలింతలు, గర్భిణీలలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఉద్దేశించిన పోషన్ అభియాన్ గడువు సెప్టెంబర్ 30 వ తేదీతో ముగుస్తున్నందున ఈ పథకాన్ని కొనసాగించాలని విజ్ణప్తి చేశారు. 

2. కోవిడ్ -19 సందర్భంగా పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తల బీమా కోసం ప్రారంభించిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని కోవిడ్ సందర్భంగా ఇంటింటికి రేషన్ ఇస్తూ కోవిడ్ రోగుల బాగోగుల కోసం తీవ్రంగా కృషి చేసిన అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు కూడా వర్తింప చేయాలని కోరారు. 

3. కేంద్ర న్యూట్రిషన్ ప్రొగ్రాం కింద అదనపు పోషకాహార కార్యక్రమంలో ఇచ్చే జొన్నలు, సజ్జల చిరుధాన్యాల కోటాను పెంచాలని కోరారు. 2021 సంవత్సరానికి 5427 మెట్రిక్ టన్నుల జొన్నలు, 2714 మెట్రిక్ టన్నుల సజ్జలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని విజ్ణప్తి చేశారు. 

4. సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసిడిఎస్) కింద కేంద్రం కొన్ని సేవలు ఉపసంహరించడం, కేంద్ర కోటాను తగ్గించడం వల్ల రాష్ట్రంలో పిల్లలు, బాలింతలు, గర్భిణీల కోసం చేపట్టే కార్యక్రమాలకు ఇబ్బంది జరుగుతుందని, 2017 వరకు గల కోటాను తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కోరారు. 



Updated Date - 2021-09-04T00:48:47+05:30 IST