బాల్య వివాహాలు లేని తెలంగాణే లక్ష్యం

ABN , First Publish Date - 2021-06-13T05:47:49+05:30 IST

బాల్య వివాహాలు లేని తెలంగాణే లక్ష్యం

బాల్య వివాహాలు లేని తెలంగాణే లక్ష్యం
హైదరాబాద్‌ నుంచి వెబ్‌నార్‌ నిర్వహిస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్‌

పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మహబూబాబాద్‌ జిల్లా

మైనర్లకు వివాహాలు చేస్తే కఠిన చర్యలు 

ఆడపిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం 

రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ 

మహబూబాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు లేని తెలంగాణ కోసం పైలెట్‌ ప్రాజెక్టు కార్యక్రమాన్ని తీసుకుంటున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యమని, బాల్య వివాహాలు చేయడం చట్టపరంగా నేరమని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌, ప్రత్యేక కార్యదర్శి దివ్య, మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, ఎస్పీ కోటిరెడ్డి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నాగవాణి, మహిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సుదర్శన్‌, ఇతర అధికారులతో శనివారం మంత్రి వెబ్‌నార్‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం మహబూబాబాద్‌ జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్య, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా బాల్య వివాహాలు జరడగం దురదృష్టకరమని, దీనివల్ల ఆడపిల్లల భవిష్యత్‌ అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లాలో కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు.  రాష్ట్రంలో ఆడపిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి సత్యవతిరాథోడ్‌ చెప్పారు. మహబూబాబాద్‌ జిల్లాలో అత్యధికంగా గిరిజనులు, నిరుపేదలు ఉన్నారని, ఆడపిల్ల ఇంట్లో ఉంటే భద్రత, పోషణ విషయంలో పేదలకు అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. అందుకే సీఎం కేసీఆర్‌ 18 ఏళ్లు నిండిన తర్వాత అమ్మాయిల వివాహం చేయడానికి ప్రోత్సహించే విధంగా ఆర్థికసాయం చేసే కల్యాణలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చారని చెప్పారు. 

ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధి జరిగినా అవగాహన కల్పించడంలో సఫలీకృతులు కావడం లేదని వాపోయారు. చివరినిమిషంలో బాల్య వివాహాలను నిలిపివేసి ఆ కుటుంబాలపై ఆర్థికభారం పడడంతో ఇబ్బందులు ఉంటాయని, ముందుగానే నిర్మూలనపై అవగాహన కల్పించాలని సూచించారు. కొవిడ్‌ వ్యాప్తితో పాఠశాలలు, కళాశాలలు లేనందున ఇంటిదగ్గర అమ్మాయిలు ఎలా ఉంటున్నారని పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. గ్రామాల్లో పంటలపై రైతులకు, కొవిడ్‌ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తరహాలోనే బాల్య వివాహాలు నేరమని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఆలయాలు, చర్చిలు, మసీదులు, జనసాంద్రత గల ప్రధాన కూడళ్లలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించే పోస్టర్లను వేయాలని సూచించారు. మైనర్‌లను పెళ్లి చేసుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులపై అవగాహన కల్పించాలని మంత్రి సత్యవతిరాథోడ్‌ అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు సూచించారు.

 

Updated Date - 2021-06-13T05:47:49+05:30 IST