ఎన్నికలేవైనా గెలుపు టీఆర్ఎస్‌దే : ప్రశాంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-02-27T20:56:21+05:30 IST

ఎన్నికలేవైనా గెలుపు టీఆర్ఎస్‌దేనని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికలేవైనా  గెలుపు టీఆర్ఎస్‌దే :  ప్రశాంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్: ఎన్నికలేవైనా గెలుపు టీఆర్ఎస్‌దేనని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్  హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సీఎం కేసీఆర్‌తో మంచి పరపతి ఉందని చెప్పారు. అలాంటి పేరును ఇంకా పెంచాలంటే వాణిదేవి‌ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వాణిదేవి పెద్ద కుటుంబం నుంచి వచ్చినా.. నిరాడంబరంగా ఉంటారని తెలిపారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా  కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదన్నారు.


పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నాడన్నారు. పద్నాలుగేళ్ల ఉద్యమం చేసి.. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడి గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దారుణంగా..  మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి పనులు.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా చూశారా అని ప్రశ్నించారు.  సీఎం కేసీఆర్ ఇచ్చే 2016 పెన్షన్లో.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 200 మాత్రమేనని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్లల్లో కేంద్రం నుంచి వచ్చేది 76వేల రూపాయలు మాత్రమేనని తెలిపారు. రాష్ట్రంలో ఇచ్చిన ఉద్యోగాల కన్నా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినా... తాను.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లు రాజీనామాకు సిద్ధమేనని బీజేపీ నేతలకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి  సవాల్ విసిరారు.

Updated Date - 2021-02-27T20:56:21+05:30 IST