సినిమా టికెట్ల గురించి హీరోలకు ఎందుకు..!? : కీలక సమావేశంలో మంత్రి పేర్ని నాని

ABN , First Publish Date - 2021-12-28T19:38:24+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల విషయంలో గత కొన్ని రోజులుగా పెద్ద రచ్చే జరుగుతున్న విషయం తెలిసిందే...

సినిమా టికెట్ల గురించి హీరోలకు ఎందుకు..!? : కీలక సమావేశంలో మంత్రి పేర్ని నాని

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల విషయంలో గత కొన్ని రోజులుగా పెద్ద రచ్చే జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు.. మరోవైపు ప్రతిపక్షాల నుంచి వీటన్నింటికీ మించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎట్టకేలకు జగన్ సర్కార్ దిగొచ్చింది. ఈ క్రమంలో సినీ హీరోలు, ఇతర పెద్దలపై కక్షతో థియేటర్లలో సినిమా ధరలు భారీగా తగ్గిస్తూ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై దిద్దుబాటుకు నడుం బిగించింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ నేతృత్వంలో 11 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. సోమవారం దీనిపై ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.


సమావేశంలో ఏం చర్చించారు..!?

అయితే ఈ తరుణంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానితో టాలీవుడ్ సినిమాకు చెందిన పలువురు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు. అమరావతిలో జరిగిన ఈ కీలక సమావేశంలో సినిమా టికెట్ ధరలు, థియేటర్ల ఇబ్బందులపై ప్రధానంగా చర్చించారు. మొత్తం 19 మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎఫ్డీసీ చైర్మన్ విజయకుమార్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. సుమారు రెండు గంటలపాటు కీలక విషయాలపైనే చర్చ జరిగింది. ఇందులో భాగంగా టికెట్ల రేట్లపై పలు ప్రతిపాదనలను డిస్ట్రిబ్యూటర్లు మంత్రి ముందుంచారు. అంతేకాదు.. సినిమా థియేటర్ల తనిఖీ విషయాన్ని కూడా మంత్రి దృష్టికి తెచ్చారు. ఇందుకు మంత్రి బదులిస్తూ.. హాళ్లలో వసతులు మెరుగుపర్చాలని ముందే చెప్పామని.. సమయం ఇచ్చినా మార్పు లేకపోవడంతోనే తనిఖీలు చేశామన్నారు. ఎగ్జిబిటర్ల ప్రతిపాదనలు కచ్చితంగా పరిశీలిస్తామని నాని హామీ ఇచ్చినట్లు తెలియవచ్చింది.


అవన్నీ హీరోలకు ఎందుకు..!?

ఇప్పటి వరకూ సినిమా టికెట్లపై టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరో నాని వ్యాఖ్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి..‘ హీరో నాని గతంలో కిరాణా కొట్టు లెక్కలు చూసారేమో మాకు ఎలా తెలుస్తుంది. హీరో సిద్దార్డ్ వ్యాఖ్యలు తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి ఉండొచ్చు. అసలు సినిమా హీరోలకు టికెట్‌ల గురించి ఎందుకు..?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. సామాన్యులకు వినోదాన్ని ఇవ్వడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ కచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సమావేశంలో తెలిపారు.


కాగా.. టికెట్ల విషయంపై నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు మీడియా ద్వారా.. సోషల్ మీడియాలో చిత్రవిచిత్రాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఎవరూ మాట్లాడొద్దని కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, ప్రముఖ నిర్మాతలు సైతం మీడియా ముందుకొచ్చి చెప్పారు. ప్రభుత్వం, కమిటీ మధ్య సమావేశం జరిగితే చాలా వరకూ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఈలోగా సంయమనం పాటించాలని నిర్మాత దిల్ రాజు తెలిపారు. సోమవారం నాడు ప్రభుత్వం కమిటీ వేసిన అనంతరం సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు టికెట్ ధరలపై ప్రభుత్వంతో చర్చించాలని నిర్ణయించి.. మంత్రి పేర్ని నాని అపాయిట్మెంట్ కోరి ఇవాళ సమావేశమై పై విషయాలు చర్చించారు.

Updated Date - 2021-12-28T19:38:24+05:30 IST