‘సహకారం’లో అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు

ABN , First Publish Date - 2022-04-09T13:22:28+05:30 IST

గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో సహకారశాఖలో రూ.482 కోట్ల మేరకు జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి ఐ.పెరియసామి

‘సహకారం’లో అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు

                             - మంత్రి పెరియస్వామి


చెన్నై: గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో సహకారశాఖలో రూ.482 కోట్ల మేరకు జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి ఐ.పెరియసామి ప్రకటించారు. శాసనసభలో శుక్రవారం జరిగిన సహకారశాఖ ఆర్థిక అనుబంధ పద్దులపై జరిగిన చర్చలకు బదులిస్తూ... గత పదేళ్లలో సహకార శాఖకు చెందిన 780 సంఘాల్లో రూ.482 కోట్ల మేర అవినీతి అక్రమాలు జరిగాయని, ఒకే వ్యక్తి తన భార్య పేరుతో రూ.14 కోట్ల మేర రుణాలు పొంది మోసం చేశాడని వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే అన్నాడీఎంకే ఎమ్మెల్యే సెల్లూరు కె.రాజు మాట్లాడుతూ.. అన్నాడీఎంకే ప్రభుత్వం అమలు చేసిన తాళికి బంగారం, మహిళలకు స్కూటీ పథకం, కరోనా సంక్షోభంలో ధర్మశాలలుగా పనిచేసిన అమ్మా క్యాంటీన్లను రద్దు చేయకూడదని డిమాండ్‌ చేశారు. ఇదే విధంగా అమ్మా ఉచిత క్లినిక్‌లను మూసివేయడం తగదన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యం వెంటనే జోక్యం చేసుకుని డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రజల వద్దకే వైద్యం’ పథకం ద్వారా సుమారు 60 లక్షల మంది లబ్దిపొందారని, ఈ పరిస్థితుల్లో అమ్మా క్లినిక్‌లు అనవసరమని భావించే వాటిని మూసివేశామన్నారు. ప్రజల వద్దకే వైద్యం పథకం ద్వారా ఇళ్ళ వద్దకు ప్రజా సంక్షేమ కార్యకర్తలే వెళుతున్నారని, వైద్యులెవరూ వెళ్లడం లేదని సెల్లూరు రాజు ఆరోపించారు.  అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలోనే ప్రజా సంక్షేమ కార్యకర్తలందరినీ డిస్మిస్‌ చేశారని మంత్రి సుబ్రమణ్యం గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజల వద్దకే వైద్య పథకం కోసం 7488 వాలంటీర్లను నియమించామన్నారు. అనంతరం మంత్రి పెరియస్వామి మాట్లాడుతూ.. అన్నాడీఎంకే సభ్యుడు సెల్లూరు రాజు సభలో ఎంజీఆర్‌ పాట పాడారని, తాను కూడా ఎంజీఆర్‌ అభిమానినేనంటూ.. తెలిసి తప్పు చేసినవారు ఎంతటివారైనా శిక్షించకుండా విడిచిపెట్టననే భావం వచ్చేలా ఓ చిత్రంలోని పాట పాడారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా సహకార శాఖ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, డీఎంకే అధికారంలోకి వచ్చాకే ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి.. సహకారశాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వ హయాంలో సహాకార సంఘాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై చేసిన ఫిర్యాదులన్నింటిపైనా సమగ్రంగా విచారణ జరిపామని, సహకార సంఘాల్లో అవినీతికి పాల్పడినట్లు రుజువైతే ఎంతటివారైనా శిక్షించాల్సిందేనని అన్నాడీఎంకే సభాపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి సూచించారు.

Updated Date - 2022-04-09T13:22:28+05:30 IST