Abn logo
Jul 31 2021 @ 03:13AM

టీ ట్యాప్‌తో టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడులు

సిరిసిల్ల అపెరల్‌ పార్కు ద్వారా.. 10 వేల మంది మహిళలకు ఉపాధి

త్వరలో చేనేత బీమా అమలు: కేటీఆర్‌


సిరిసిల్ల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ‘చేనేత, జౌళి రంగాల ప్రాముఖ్యం దృష్ట్యా తెలంగాణ వాసులకు కొలువులు, ఉపాధి అవకాశాలు దక్కే విధంగా సీఎం కేసీఆర్‌ ఆలోచనతో టీ ట్యాప్‌ ఏర్పాటు చేశాం. దీనిద్వారా ప్రపంచంలో ఉండే ముఖ్యమైన సంస్థలు టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి’ అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన అపెరల్‌ పార్కులో ప్రముఖ గార్మెంట్‌ సంస్థ గోకుల్‌ దాస్‌ ఇమేజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. టెక్స్‌టైల్‌,  అపెరల్‌ పాలసీ (టీ ట్యాప్‌)లో భాగంగా పెట్టుబడుల కోసం ప్రపంచంలోని ప్రముఖమైన సంస్థలను కలిశామన్నారు. అందులో భాగంగా యంగ్‌వన్‌ సంస్థ వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో 300 ఎకరాల్లో సంస్థను ఏర్పాటు చేస్తోందని చెప్పారు.


దీని ద్వారా 12 వేల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. వరంగల్‌ తరువాత సిరిసిల్ల, గద్వాల, నారాయణపేట, పోచంపల్లిలలో టెక్స్‌టైల్‌ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టడానికి పెద్ద కంపెనీలు ముందుకొస్తున్నాయన్నారు. సిరిసిల్ల అపెరల్‌ పార్కు ద్వారా కొద్ది రోజుల్లోనే 10 వేల మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని కేటీఆర్‌ వెల్లడించారు. ప్రపంచ విపణిలో మేడిన్‌ సిరిసిల్ల బ్రాండ్‌గా నిలిచే విధంగా ఇక్కడి దుస్తుల ఉత్పత్తి రంగం చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ పత్తి నాణ్యతలో దేశంలోనే నంబర్‌ వన్‌ అన్నారు. రైతు బీమా తరహాలో నేతన్నలకు రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. సిరిసిల్ల, నల్లగొండ, కాటేదాన్‌ వంటి ప్రాంతాల్లో ఉండే మరమగ్గాలను ఆధునికీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. 

క్రైమ్ మరిన్ని...