ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ సామాజిక దూరం పాటించాలి

ABN , First Publish Date - 2020-04-09T21:01:03+05:30 IST

తెలంగాణలోని దాదాపు అన్నిజిల్లాల్లో ధాన్యం కొనుగోలు ముమ్మరంగా జరుగుతోంది. గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రభుత్వం కొనుగోలుచేస్తోంది.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ సామాజిక దూరం పాటించాలి

హైదరాబాద్‌: తెలంగాణలోని దాదాపు అన్నిజిల్లాల్లో ధాన్యం కొనుగోలు ముమ్మరంగా జరుగుతోంది. గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రభుత్వం కొనుగోలుచేస్తోంది. ఈనేపధ్యంలో రైతులు, కార్మికులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా ఉండేందుకు సామాజిక దూరం పాటించాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ గంగుల కమలాకర్‌ విజ్ఞప్తిచేశారు. గురువారం హాకాభవన్‌లో ధాన్యం కొనుగోళ్లు, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ  పరిశుభ్రత విషయంలోనూ, వసతుల కల్పనలో రాజీపడొద్దన్నారు. వరికోతలను బట్టి దశల వారీగా కొనుగోలు కేంద్రాలను ప్రారంబించాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 713 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు. వారం రోజుల్లో వరికోతలు ఊపందుకుంటాయి. ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేసి కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు , కొనుగోలు కేంద్రాల సక్రమపనితీరుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన వరిసాగు పెంచే చర్యలను అధ్యయనం చేయడానికి ఏపీసీ అండ్‌ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం సమీక్షా సమావేశంలో చెప్పినట్టు తెలిపారు. ఈ విషయంలో రాష్ర్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ సలహాను కమిటీ తీసుకోవాలన్నారు. మిల్లుల మిల్లింగ్‌ సామర్ధ్యం, నిల్వ సామర్ధ్యం పెరగడం, బియ్యం మిల్లింగ్‌ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని మంత్రులు తెలిపారు. ఆహార ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు విషయంలో నిపుణుల సేవలను వినియోగించుకుని బియ్యం మిల్లింగ్‌ పరిశ్రమ, రాష్ట్రంలో ఆహార ప్రక్రియ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - 2020-04-09T21:01:03+05:30 IST