వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-27T20:11:22+05:30 IST

రైతుల ప్రయోజనాల కోసం పాటుడుతన్న తెలంగాణలో వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాల్సిన అవసరం ఎంతయినా వుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: రైతుల ప్రయోజనాల కోసం పాటుడుతన్న తెలంగాణలో వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాల్సిన అవసరం ఎంతయినా వుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జనాభాలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని చెప్పారు.అందుకే నాబార్డ్ సహకారంతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల పునరుద్దరణతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని అన్నారు. గురువారం నగరంలోని మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి నివాసంలో రాబోయే 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి గాను లక్షా 66 వేల 384 కోట్ల రుణ సామర్థ్యంతో నాబార్డు రూపొందించిన రాష్ట్ర దృష్టి పత్రాన్ని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి విడుదల చేశారు. 


అనంతరం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి తాగునీరు పథకాన్ని పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.ఈ పథకాల మూలంగా తెలంగాణ వ్యాప్తంగా భూగర్భజలాలు పెరిగాయన్నారు. పంటల విస్తీర్ణం పెరగడంతో పాటు రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నది. 


కానీ సుస్థిర వ్యవసాయం ప్రాధాన్యం గుర్తించి పంట వైవిద్యీకరణలో భాగంగా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా ధీర్ఘకాలిక ఆయిల్ పామ్ వంటి పంట సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని మంత్రలులు తెలిపారు. దీనికోసం నాబార్డు సూచనల మేరకు క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు ఆయిల్ పామ్ సాగుకు సహకరించాలని కోరారు.రైతుల ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, ఆహారశుద్ది రంగంలో ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తున్నదని చెప్తూ సహకార రంగానికి నాబార్డు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని మంత్రులు పేర్కొన్నారు.


ప్రతి జిల్లాలో 500 ఎకరాలను గుర్తించి అందులో ఆహార శుద్ది పరిశ్రమల  ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమవుతున్నదని అన్నారు. ఇందులో ఆహార శుద్ధి పరిశ్రమలు, గోడౌన్లు, మౌళిక సదుపాయాలతో పాటు పంటల ఉత్పత్తుల ఎగుమతులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుని యువత ఉపాధి కోసం ఇటు వైపు దృష్టిసారించాలి. దీనికి బ్యాంకర్లు ఆర్థిక సహకారం అందించాలన్నారు. 


నాబార్డు కార్యక్రమాలకు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ , అర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు , ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్  నిఖిల, నాబార్డ్ సీజీఎం వైకే రావు, ఎస్ ఎల్ బీసీ చైర్మన్ అమిత్ జింగ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T20:11:22+05:30 IST