రైతుబంధు ఎనిమిది విడతల్లో రూ.50 వేల కోట్లు

ABN , First Publish Date - 2021-12-28T01:05:19+05:30 IST

రైతు బంధు పథకం ద్వారా రైతులకు చేయూతనిస్తున్నఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

రైతుబంధు ఎనిమిది విడతల్లో రూ.50 వేల కోట్లు

హైదరాబాద్: రైతు బంధు పథకం ద్వారా రైతులకు చేయూతనిస్తున్నఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని తెలిపారు.ఈ నెల 28వ తేదీ నుండి యాసంగి రైతుబంధు నిధులు పంపిణీ చేయనున్నట్టు మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పథకం ప్రారంభమయినప్పటి నుండి ఏడు విడతలలో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాలలోకి జమ చేయడం జరిగింది. తాజాగా ఎనిమిదో విడతగా ఈ సీజన్ తో కలుపుకుని మొత్తం రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో జమ చేసినట్టవుతుందన్నారు. 


డిసెంబరు10 వ తేదీ నాటికి ధరణి పోర్టల్ నందు పట్టాదారులు, కమీషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అందిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాదారులు రైతుబంధుకు అర్హులని అన్నారు.ఈ సీజన్ లో 66.61 లక్షల మంది రైతులకు గాను 152.91 లక్షల ఎకరాలకు 7645.66  కోట్లు జమచేయడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఇందులో 3.05 లక్షల ఎకరాలకు గాను 94 వేల మంది రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులని అన్నారు.ఎకరా నుండి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగా ఆరోహణా క్రమంలో నిధులు జమ చేస్తామన్నారు. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాలలో ఒకటిగా రోమ్ లో 2018 నవంబరులో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎఫ్ ఎ ఓ  గుర్తించిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-12-28T01:05:19+05:30 IST