రైతాంగం శ్రేయస్సు కోసం కేంద్రం ఆలోచనా ధోరణి మారాలి

ABN , First Publish Date - 2021-10-07T20:15:01+05:30 IST

రైతాంగం శ్రేయస్సు కోసం కేంద్రం ఆలోచనా ధోరణి మారాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. పంటలను సమతుల్యం చేయడంలో కేంద్రం బాధ్యత తీసుకోవాలన్నారు.

రైతాంగం శ్రేయస్సు కోసం కేంద్రం ఆలోచనా ధోరణి మారాలి

హైదరాబాద్: రైతాంగం శ్రేయస్సు కోసం కేంద్రం ఆలోచనా ధోరణి మారాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. పంటలను సమతుల్యం చేయడంలో కేంద్రం బాధ్యత తీసుకోవాలన్నారు. సేంద్రీయ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహంపై శాసనమండలిలో సభ్యులు గోరటి వెంకన్న,గంగాధర్ గౌడ్, నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పప్పుగింజలు, నూనె గింజలు వంటి పంటలను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వంవ్యవసాయంలో సేంద్రీయ సాగును ప్రోత్సహిస్త్తోందని తెలిపారు. 1967లో సస్యవిప్లవం తర్వాత దేశంలో పంటసాగులో ఎరువులు, రసాయనాల వాడకం మొదలయిందని చెప్పారు. 


దేశంలో ప్రజల ఆకలిని తీర్చేందుకు పంట ఉత్పత్తులు పెంచడంలో భాగంగా నూతన వంగడాల సృష్టి, ఎరువుల వాడకం మొదలైందన్నారు. 1967 కు ముందు దేశంలోని సాంప్రదాయ వ్యవసాయంలో పశువుల, మేకలు, గొర్రెల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, ఆకులు, అలముల వంటివి మినహా మనదేశంలో  ఏ ఎరువులు వినియోగంలో లేవని గుర్తు చేశారు. అప్పట్లో జ్వరమొస్తే బువ్వ, జేజ కోసం తప్ప ప్రజలకు మిగతా రోజుల్లో గంజి, జొన్న గట్క, రాగి గట్కలే అలవాటైందన్నారు. అప్పుడు ఉన్నతాశయంతో నిర్ణయం తీసుకుని అప్పటి పరిస్థితుల దృష్ట్యా పంటల దిగుబడి పెరిగినా కాలక్రమంలో పంటల సాగులో ఎరువులు, రసాయనాల వాడకం మీద చర్చ జరగలేదన్నారు.సేంద్రీయ వ్యవసాయం అంటే అదేదో కొత్త విధానం అనుకుంటున్నారు.


గ్లైఫోసెట్ అనే గడ్డి మందును తెలంగాణ ప్రభుత్వం నిషేదించిందన్నారు.అంతర్జాతీయ ఒప్పందాల నేపథ్యంలో రాష్ట్రాలు ఈ విషయంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని కేంద్రం ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు. ప్రజలే సొంతంగా మిద్దె తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఈ దిశగా దృష్టి సారించాలని సూచించారు. ఉద్యానశాఖ మిద్దె తోటలకు ప్రోత్సాహం ఇస్తుందని మంత్రి తెలిపారు. రసాయనిక, ఎరువుల అవశేషాలు లేని పంట ఉత్పత్తులకు అంతర్జాతీయ విపణిలో డిమాండ్ ఉందని మంత్రి తెలిపారు.సేంద్రీయ సాగుపై రైతులకు నమ్మకం కలిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కార్యాచరణ చేయాలని అన్నారు. 


Updated Date - 2021-10-07T20:15:01+05:30 IST