వ్యవసాయమే ఈ దేశ భవిష్యత్-దానికి తెలంగాణ దిక్సూచి: నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-20T21:33:18+05:30 IST

వ్యవసాయమే ఈ దేశానికి భవిష్యత్ అని దానికి తెలంగాణ దిక్సూచి అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

వ్యవసాయమే ఈ దేశ భవిష్యత్-దానికి తెలంగాణ దిక్సూచి: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: వ్యవసాయమే ఈ దేశానికి భవిష్యత్ అని దానికి తెలంగాణ దిక్సూచి అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్లలో అనేక విజయాలు సాధించాం .. ఇంకా సాధించాల్సి ఉందన్నారు.కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకున్నాం.వ్యవసాయానికి అవసరమైన రైతుబంధు, ఉచితంగా 24 గంటల కరంటు దేశంలో ఎక్కడా లేనివిధంగా అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుభీమా పథకం అమలుచేస్తున్నామని,తెలంగాణ జీఎస్డీపీలో వ్యవసాయరంగ వాటా 21 శాతంగా వుందన్నారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల అగ్రి ఎక్స్ పో సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటాయన్నారు.


ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ, కర్ణాటకలో చిన్న మొత్తం మినహా దేశంలో ఎక్కడా 5 లేదా పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులు కట్టలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు ఉండడం మూలంగా తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు. ఒకప్పుడు కంట్రోలు బియ్యం కోసం ఎదురుచూసిన తెలంగాణ రైతు నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగారని, కేంద్రప్రభుత్వం తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులెత్తేసే స్థాయికి చేరుకున్నామని మంత్రి తెలిపారు.తెలంగాణ నుండి వస్తున్న ఉత్పత్తులను ఎలా వాడుకోవాలి అన్న ఆలోచన, ముందుచూపు కేంద్రానికి ఉండాలన్నారు.మేము కొనం .. మీరు సాగు చేయవద్దు అని చెప్పడం గొప్పతనం కాదు .. ఉత్పత్తులను ఉపయోగించుకునే దార్శనికత ఉండాలన్నారు. పెరిగిన శాస్త్ర సాంకేతికత రైతుల వద్దకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.


ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య అధిక పెట్టుబడి, తక్కువ పెట్టుబడి, తక్కువ మానవ శ్రమతో ఎక్కువ పని జరిగేలా చూడడం, అధిక రాబడి, అధికలాభాలు సాధించడం మీద పరిశోధకులు దృష్టి సారించాలని మంత్రి సూచించారు.వ్యవసాయాన్ని మించి ఉపాధి కల్పించే రంగం ఈ దేశంలో ఇంకొకటి లేదు .. అమెరికా తర్వాత అత్యధిక సాగుభూమి ఉన్న దేశం భారత్ మాత్రమేనని అన్నారు.కొత్తతరం వ్యవసాయరంగం మీద పెద్ద ఎత్తున దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి జీవం పోశారు. దేశానికి తెలంగాణ కొత్త దారి చూపుతున్నదని మంత్రి తెలిపారు.కొత్తతరం వ్యవసాయరంగా మీద దృష్టిసారించి ప్రపంచానికి నాణ్యమైన ఆహారం అందించే స్థితికి భారతదేశం చేరుకోవాలన్నారు.ఈ సదస్సు దానికి బాటలు వేస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

Updated Date - 2022-04-20T21:33:18+05:30 IST