ఇంటివద్దకే కొవిడ్‌ సేవలు.. అభినందనీయం

ABN , First Publish Date - 2021-05-19T05:27:04+05:30 IST

కరోనా బాధితుల ఇంటివద్దకే వెళ్లి ఎటువంటి లాభం ఆశించకుండా వైద్యం చేయడం సాహసోపేతం అని రాష్ట్ర రవాణా, పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు.

ఇంటివద్దకే కొవిడ్‌ సేవలు.. అభినందనీయం
ల్యాబ్‌లో మెషిన్‌లను ప్రారంభిస్తున్న మంత్రి నాని, ఎమ్మెల్యే శివకుమార్‌, డాక్టర్‌ శారద

మిగిలిన డాక్టర్‌లూ ఆదర్శంగా తీసుకోవాలి

రాష్ట్ర మంత్రి పేర్ని నాని

తెనాలిలో ఆధునిక ల్యాబ్‌ ప్రారంభం

తెనాలి, మే 18 (ఆంధ్రజ్యోతి): కరోనా బాధితుల ఇంటివద్దకే వెళ్లి ఎటువంటి లాభం ఆశించకుండా వైద్యం చేయడం సాహసోపేతం అని రాష్ట్ర రవాణా, పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. మిగిలిన వైద్యులు.. డాక్టర్‌ శారద చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెనాలిలో శారద సర్వీసెస్‌ సొసైటీ, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ తెనాలి శాఖల సమన్వయంతో ఏర్పాటుచేసిన ల్యాబ్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. రాజేంద్రకుమార్‌ జైన్‌ స్మారకార్ధం ఆయన కుమార్తె యుక్త జైన్‌ రూ.5 లక్షల విలువైన ల్యాబ్‌ మెషిన్‌లను అందించారు. ఈ ల్యాబ్‌ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి నాని మాట్లాడుతూ డాక్టర్‌ శారద దేశంలోనే వినూత్నంగా ఇంటింటికీ తిరిగి వైద్యం అందింటం గొప్ప విషయమన్నారు. అనంతరం ’బ్రేక్‌ కోవిడ్‌ తెనాలి.కామ్‌’ అనే యాప్‌ను తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, మంత్రి నాని ప్రారంభించారు. కరోనా బాఽఽధితులు కానీ, అనుమానం ఉన్నవారు కానీ ఈ యాప్‌లోకి వెళ్లి తమకున్న లక్షణాలను అప్‌లోడ్‌ చేస్తే, రాష్ట్రంలో ఉన్నవారే కాకుండా, అమెరికాలోని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ఈదర లోకేశ్‌ వంటివారు పరిశీలించి వారికి సలహాలు అందిస్తారని ఆమె వివరించారు. దాత రాజేంద్రకుమార్‌ జైన్‌ కుమార్తె, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శివకుమార్‌ అభినందించారు. శారద సర్వీసెస్‌ సొసైటీకి డబుల్‌ హార్స్‌ మినపగుళ్లు అధినేత శ్యామ్‌ రూ.50వేల చెక్‌ను, మున్సిపల్‌ వైస్‌చైౖర్మన్‌ మాలేపాటి హరిప్రసాద్‌ అందించిన రూ.25వేలను, మరికొందరు అందించిన సాయాన్ని మంత్రి నాని ఆమెకు అందించారు. కార్యక్రమంలో మున్సిపిల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లు సయ్యద్‌ కాలేదా నసీమా, మాలేపాటి హరి, మున్సిపల్‌ కమిషనర్‌ జస్వంతరావు, డీఎస్‌పీ స్రవంతీరాయ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో నరసింహనాయక్‌, రోటరీ క్లబ్‌ ప్రతినిధి గుత్తా వెంకటరత్నం, దాతలు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-05-19T05:27:04+05:30 IST