నాచారం ఈఎస్‌ఐకి నిధులు కేటాయించండి: మంత్రి మల్లారెడ్డి

ABN , First Publish Date - 2021-09-01T22:57:21+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోగల నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రికి నిధులు కేటాయించాలని

నాచారం ఈఎస్‌ఐకి నిధులు కేటాయించండి: మంత్రి మల్లారెడ్డి

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోగల నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రులను రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి  కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్‌‌లను మంత్రి మల్లారెడ్డి కలిసారు. కరోనా సమయంలో సనత్‌నగర్‌ హాస్పిటల్‌ను ఈఎస్‌ఐకి అప్పగించామని ఆయన తెలిపారు. తెలంగాణలో కొత్త జిల్లాలకు తగ్గట్టుగా ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌‌ను మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను  మల్లారెడ్డి కోరారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కోసం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీ కార్యాలయం భూమిపూజ కోసం పార్టీ అధినేత ఆధ్వర్యంలో పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ  వచ్చారన్నారు. 


ఈ సందర్భంగా కేంద్ర మంత్రులను కలిసినట్లు ఆయన తెలిపారు. కార్మిక మంత్రిత్వ శాఖకు స్కిల్ డెవలప్ మెంట్ కింద కేంద్రం నుంచి రావాల్సిన పెండింగు నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలసి విజ్ఞప్తి చేసామని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసి, నాచారంలో ఉన్న 350 బెడ్ల ఈఎస్ఐ హాస్పటల్ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు, సహకారం అందించాలని కోరామన్నారు. కరోనా సమయంలో 17 లక్షల మంది ఈఎస్ఐ లబ్దిదారులకు చాలా ఇబ్బంది ఏర్పడిందన్నారు. గతంలో కార్మిక మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్న సనత్ నగర్ హాస్పటల్‌ను కార్పోరేట్ స్థాయిలో తీర్చిదిద్ది ఈఎస్ఐ కార్పోరేషన్‌కు అప్పగించామని,  దానికి ప్రతిగా రాష్ట్రానికి నాచారం హాస్పటల్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అక్కడ పదిసంవత్సరాలుగా నత్తనడకన సాగిన పనులు ఇటీవల పూర్తయినా సరియైన సదుపాయాలు లేవన్నారు. ఈ హాస్పటల్‌కు అనుబంధంగా ఏర్పాటు చేయదలచిన ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి నిధులు, సహకారం అందించాలని కోరామన్నారు. 


కేంద్ర మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన 140 కోట్ల పెండింగు నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రులను కోరినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు ఏర్పడడంతో పాటు, కొత్త పరిశ్రమలు, కార్మికుల సంఖ్య పెరుగుతున్నందున వాటికి అనుబంధంగా కొత్త ఈఎస్ఐ హాస్పటల్స్ మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-09-01T22:57:21+05:30 IST