రైతుకు న్యాయం చేస్తాం

ABN , First Publish Date - 2020-04-03T12:01:14+05:30 IST

రొయ్య ఉత్పత్తులను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు.

రైతుకు న్యాయం చేస్తాం

పూర్తిస్థాయిలో ఆక్వా ఉత్పత్తులు కొనుగోలు చేస్తాం

కూలీల రేట్లు పెంచేందుకు చర్యలు

ధైర్యంగా ముందుకు రావాలి: మంత్రి కన్నబాబు


 కరప, సామర్లకోట, ఏప్రిల్‌ 2: రొయ్య ఉత్పత్తులను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. కరప మండలం పాతర్లగడ్డ, గురజనాపల్లి గ్రామాల్లోను, సామర్లకోట మండలం పనసపాడులోని రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్లను గురువారం ఆయన పరిశీలించారు. కంపెనీ యజమానులతో మాట్లాడి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రొయ్యలను కొనుగోలు చేయాలని సూచించారు. ప్ల్లాంట్‌లలో రొయ్యలను ప్రాసెసింగ్‌ చేసేందుకు మహిళా కార్మికులు రావడంలేదని, దీంతో కొనుగోళ్లు నిలిపివేసినట్టు కంపెనీల ప్రతినిధులు మంత్రికి వివరించారు.


ప్రతీ ప్లాంట్‌కు ఒక నోడల్‌ అధికారిని నియమిస్తున్నామని, మండల స్థాయి, డివిజన్‌ స్థాయి అధికారులు గ్రామాల్లోకి వెళ్లి కార్మికులందరూ పనిలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటారని మంత్రి తెలిపారు. కార్మికులు పనిచేసేందుకు అనువుగా ప్లాంట్‌ల వద్ద శానిటైజర్‌లు, మాస్క్‌లు, సబ్బులు ఏర్పాటు చేయాలని, భౌతికదూరం పాటిస్తూ పని చేయించుకోవాలని, కార్మికులకు 50 శాతం అదనంగా వేతనాలందించేందుకు కంపెనీ యజమానులు అంగీకరించారని చెప్పారు. రొయ్య రైతులకు అన్నివిధాల న్యాయం జరిగేలా సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి వివరించారు. తహశీల్దార్‌ సీహెచ్‌.ఉదయభాస్కర్‌, ఎంపీడీవో కర్రె స్వప్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-03T12:01:14+05:30 IST