రేపు కోనాపూర్‌కు మంత్రి కేటీఆర్‌ రాక

ABN , First Publish Date - 2022-05-09T07:34:15+05:30 IST

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వారి నానమ్మ ఊరుకు మంగళవారం వస్తున్నారు.

రేపు కోనాపూర్‌కు మంత్రి కేటీఆర్‌ రాక
కోనాపూర్‌ గ్రామం

- మొదటిసారి నానమ్మ ఊరుకు వస్తున్న కేటీఆర్‌

- పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి

- గ్రామానికి కేటీఆర్‌ వస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు


కామారెడ్డి, మే 8: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వారి నానమ్మ ఊరుకు మంగళవారం వస్తున్నారు. గ్రామంలో ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. కేసీఆర్‌ తల్లిదండ్రులు రాఘవరావు, వెంకటవ్వలు ప్రస్తుతం ఉన్న బీబీపేట మండలం కోనాపూర్‌ గ్రామంలో నివసించేవారని తెలుస్తోంది. కోనాపూర్‌ నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చింతమడక గ్రామానికి వెళ్లినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ కూడా చింతమడకలోనే పుట్టారు. వారి తల్లిదండ్రులు మాత్రం కోనాపూర్‌లో నివసించినప్పుడు మానేర్‌ డ్యాం నిర్మాణం జరిగినప్పుడు కూడేళ్లి వాగుకు అడ్డంగా డ్యాంను నిర్మించారు. డ్యాం నిర్మాణంతో ఊరు నీటి మునకకు గురవుతుందని చెప్పడంతో కోనాపూర్‌ గ్రామాన్ని విడిచి చింతమడక గ్రామానికి వెళ్లి స్థిరపడ్డారు. కేసీఆర్‌ అన్నదమ్ములు, అక్కా చెల్లెలు చింతమడకలోనే పుట్టిపెరిగారు. కేసీఆర్‌ మేనమామలు కామారెడ్డి ప్రాంతంలో ఉండేవారు. చింతమడకలో ఉన్నప్పుడు కేసీఆర్‌తో పాటు వారి అన్నలతో కలిసి మేనమామల ఊరికి వచ్చేవాడు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ సమయంలో కామారెడ్డిని కేంద్రంగా చేసుకుని ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కామారెడ్డికి బ్రిగ్రేడియర్‌గా పని చేశారు. కామారెడ్డి ప్రాంత వాసులతో ఉన్న సాన్నిహిత్యంతో కేసీఆర్‌ ఉద్యమాన్ని ఉధృతం చేసినప్పుడు తన తల్లిదండ్రుల ఊరు కోనాపూర్‌ అని గుర్తుచేసేవాడు. ఇటీవల బీబీపేటలో పారిశ్రామిక వేత్త సుభాష్‌రెడ్డి రూ.7 కోట్లతో నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్‌ అదేరోజు వేదికపై తన నానమ్మల ఊరు కోనాపూర్‌ను సందర్శిస్తానని మాట ఇచ్చారు. మాట ప్రకారమే మంగళవారం కోనాపూర్‌ గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రస్తుతం కోనాపూర్‌ గ్రామంలో 1,057 జనభా ఉండగా 409 పురుషుల ఓటర్లు, 419 మహిళ ఓటర్లు ఉన్నారు. కేటీఆర్‌ పుట్టినప్పటి నుంచి కూడా కోనాపూర్‌కు రాలేదు. ఈ సారే మొదటిసారి కోనాపూర్‌కు వస్తున్నట్లు తెలుసుకున్న గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 80 సంవత్సరాల క్రితమే గ్రామాన్ని కేటీఆర్‌ నానమ్మ, తాతలు విడిచివెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

కూలి పోయిన ఇళ్లు మాత్రమే ఉంది

- సాయాగౌడ్‌, మాజీ సర్పంచ్‌

కోనాపూర్‌ గ్రామంలో కేటీఆర్‌ నానమ్మ, తాతలు ఇళ్లు ఇప్పటికీ శిథిలావస్థలో కూలిపోయి ఉంది. ఆ ఇంటిని చూడటానికి కేటీఆర్‌ మొదటిసారి గ్రామానికి వస్తున్నారు. ఆయన రావడం గ్రామస్థులకు ఎంతో ఆనందంగా ఉంది. 


గ్రామానికి అభివృద్ధి నిధులు ఇవ్వాలి

- నర్సవ్వ, సర్పంచ్‌, కోనాపూర్‌

మంత్రి కేటీఆర్‌ కోనాపూర్‌కు మొదటిసారి రావడం ఆనందంగా ఉంది. గ్రామంలో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలి. నానమ్మఊ రును మర్చిపోకుండా మంత్రి కేటీఆర్‌ తమ గ్రామానికి రావడం గ్రామస్థులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ కూడా తమ గ్రామాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాం.

Read more