తెలంగాణ పాలిట శనిలా మోదీ సర్కారు!

ABN , First Publish Date - 2022-07-30T09:47:17+05:30 IST

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణకు శనిలా దాపురించిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

తెలంగాణ పాలిట శనిలా మోదీ సర్కారు!

ఐటీఐఆర్‌ రద్దుపై కేంద్రం ప్రకటన సిగ్గుచేటు 

రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కేంద్రం

ఆ పార్టీ డీఎన్‌ఏలో అసత్యాలు, అవాస్తవాలు 

ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయమేది?: కేటీఆర్‌ 


హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణకు శనిలా దాపురించిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేశామని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పార్లమెంట్‌లో చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే విభజన హామీలన్నింటినీ పక్కన పెట్టిందని ఆరోపించారు. తెలంగాణలో ఐటీని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 2008లో కేంద్రంలోని అప్పటి ప్రభుత్వం హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ఏర్పాటు ప్రతిపాదన చేసిందని, 2013లో దానికి ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్‌తోపాటు ఎన్నో ప్రాజెక్టులను మూలకు పెట్టిందని విమర్శించారు. పైగా ఐటీఐఆర్‌ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంటులో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.


బీజేపీ డీఎన్‌ఏలోనే అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు నిండి ఉన్నాయన్నారు. రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దుచేసి మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు రద్దుతో హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ మరింత ఎదిగే అవకాశాన్ని కోల్పోయిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ సాధిస్తున్న ప్రగతికి కేంద్రం చేసిందేమీలేదని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. సీఎం కేసీఆర్‌తోపాటు తాను కూడా వివిధ సందర్భాల్లో ఢిల్లీ వెళ్లి ఐటీఐఆర్‌ గురించి ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను అడిగానని, కానీ.. ఎన్నిసార్లు కోరినా తోలుమందం కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదని ధ్వజమెత్తారు. దానికి సమానస్థాయిలో ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కోరినా స్పందించలేదన్నారు. హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని ప్రత్యామ్నాయం చూపలేదని ఆరోపించారు. 


మోదీ నిర్ణయాల వల్లే సంక్షోభం..

ప్రధాని మోదీ అనాలోచిత, అసంబద్థ నిర్ణయాలతో దేశంలో ఆర్థిక, సామాజిక సంక్షోభం తలెత్తిందని కేటీఆర్‌ అన్నారు. అయినా ఆ సమయంలోనూ దేశ సగటును మించిన అద్భుతమైన ప్రగతిని తెలంగాణ ఐటీ పరిశ్రమ సాధించిందన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు ఉండి ఉంటే ఈ ఏడేళ్లలో హైదరాబాద్‌ ఐటీ ఎకో సిస్టం ఆకాశమే హద్దుగా ఎదిగేదన్నారు. ఐటీఐఆర్‌ రద్దుతో ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణకు జరిగిన నష్టంపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నా ప్రధాని మోదీలో చలనం రావడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 22 సాప్ట్‌వేర్‌ పార్కులను ప్రకటించి తెలంగాణకు మెండిచేయి చూపడం బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిన్నచూపునకు నిదర్శనమన్నారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ టీ హబ్‌-2 నిర్మాణాన్ని రూ.450 కోట్లతో పూర్తి చేస్తే, దానికి కేంద్రం నుంచి పైసా సహాయం లేదన్నారు. దేశ ఐటీ రంగానికి దిక్సూచిగా ఎదుగుతున్న తెలంగాణకు ఇప్పటికైనా  ఐటీఐఅర్‌కు సమానంగా ఒక పథకాన్ని లేదా ప్యాకేజీని ప్రకటించి నిబద్దత చాటుకోవాలన్నారు.

Updated Date - 2022-07-30T09:47:17+05:30 IST