మోదీకి మళ్లీ అవకాశం ఇస్తే ఏపీ, తెలంగాణని కలిపేస్తారు!

ABN , First Publish Date - 2022-02-17T08:34:52+05:30 IST

ప్రధానిగా నరేంద్ర మోదీకి మరొకసారి అవకాశం ఇస్తే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ను కలిపేస్తారని మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ దేశానికి ప్రధానమంత్రా? లేక ఉత్తర భారతదేశానికి మాత్రమే ప్రధానమంత్రా?’’ అన్న సందేహం

మోదీకి మళ్లీ అవకాశం ఇస్తే ఏపీ, తెలంగాణని కలిపేస్తారు!

  • ఆయన మొత్తం దేశానికీ ప్రధానా? లేక.. ఉత్తర భారతానికి మాత్రమేనా?
  • బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది
  • ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతోంది
  • మరోసారి మోదీ గెలిస్తే ఎల్‌ఐసీని
  • అమ్మేసినట్టు రాష్ట్రాన్నీ అమ్మేస్తారు
  • తెలంగాణపై వివక్ష.. కక్ష సాధింపు
  • రాష్ట్ర పుట్టుకను మోదీ ప్రశ్నిస్తున్నారు
  • ప్రాజెక్టులకు జాతీయహోదా రాకుండా అడ్డుకున్నారు
  • సెంట్రల్‌ వర్సిటీలు రాకుండా చేశారు
  • కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేం లేదు
  • తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేటీఆర్‌
  • నిజామాబాద్‌ జిల్లా సిద్దాపూర్‌లో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాప


కామారెడ్డి, వర్ని, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రధానిగా నరేంద్ర మోదీకి మరొకసారి అవకాశం ఇస్తే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ను కలిపేస్తారని మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ దేశానికి ప్రధానమంత్రా? లేక ఉత్తర భారతదేశానికి మాత్రమే ప్రధానమంత్రా?’’ అన్న సందేహం కలుగుతోందన్నారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్న పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ మత రాజకీయాలకు తెరతీసిందని.. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్‌ గ్రామంలో రూ.120 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకం (రిజర్వాయర్‌) నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ బుధవారం శంకుస్థాపన చేశారు.


అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇప్పటికే నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌తో బాన్సువాడ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోందని గుర్తుచేశారు. రూ.120 కోట్లతో సిద్దాపూర్‌ ఎత్తిపోతల పథకం.. రూ.106 కోట్లతో మూడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌లతో బాన్సువాడ నియోజకవర్గం తెలంగాణలోనే అత్యధికంగా పంటలు పండే ప్రాంతంగా మారనుందన్నారు. బాన్సువాడ మునిసిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు చేస్తాన ని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. అలాగే..  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లో ఎలాగైనా మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు దేశవ్యాప్తంగా హిందు, ముస్లింల మధ్య గొడవలు సృష్టించేందుకు బీజేపీ పన్నాగం పన్నుతోందని ఆరోపించారు. కర్ణాటకలో హిజాబ్‌ అంశం అందులో భాగమేనని ధ్వజమెత్తారు. ఏడున్నరేళ్ల మోదీ పాలనను పలువురు మేధావులు ‘సాడే సాత్‌’ పాలనగా అభివర్ణించారని కేటీఆర్‌ పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి.. కార్పొరేట్‌ సెక్టార్‌కు కొమ్ము కాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే, ఎల్‌ఐసీ వంటి ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన ఘనత మోదీదేనని, మరోసారి బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను సైతం మోదీ అమ్మేస్తారని కేటీఆర్‌ అన్నారు. 


ఎంత కక్ష ఉందో..

ఇప్పటికే తెలంగాణపై మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని.. రాష్ట్ర పుట్టుకనే ప్రశ్నించారని కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేసినట్టు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణను ఏర్పాటు చేశారన్న మోదీ వ్యాఖ్యలతో.. రాష్ట్రంపై ఆయనకు ఎంత కక్ష ఉందో అర్థం అవుతోందన్నారు. రాష్ట్ర ఏర్పాటునే అవమానించిన ప్రధాని మోదీ.. రాష్ట్రానికి రావాల్సిన పలు కేంద్ర ప్రాజెక్టులను, నిధులను రా కుండా అడ్డుకుని తెలంగాణ ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా.. మోదీ అడ్డుకున్నారని ఆరోపించారు. ఏడున్నర సంవత్సరాల బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా 157 కేంద్ర మెడికల్‌ కళాశాలలు మంజూరు కాగా.. వాటిలో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని గుర్తుచేశారు.


అలాగే.. 87 నవోదయ పాఠశాలలను, 8 ఐఐఏం విద్యాసంస్థలను, 6 నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌లను బీజేపీ దేశవ్యాప్తంగా మంజూరు చేసిందని.. వాటన్నింటినీ ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు కేటాయించిందే తప్ప తెలంగాణకు ఒక్కటీ మంజూరు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిలదీసేందుకు రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం లేవని.. ఆ నాయకులంతా చవటలని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గుణాత్మక మార్పు ఏదీ లేదంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని రైతుల వద్దకు వెళ్లి తెలంగాణలో ఎలాంటి గుణాత్మక మార్పు వచ్చిందో తెలుసుకోవాలని హితవు పలికారు. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు. వారంతా కేంద్రం వద్ద బానిసలా బతుకుతున్నారని మండిపడ్డారు.

  

రాహుల్‌ జీ.. రేవంత్‌ అత్యంత దుష్టుడు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ‘అత్యంత దుష్టుడు’గా మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు. దివంగత కాంగ్రెస్‌ నేత, మాజీ ప్రధానిని అవమానపరిచే విధంగా అసోం సీఎం హిమంత విశ్వ శర్మ చేసిన దారుణమైన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్‌ రాజకీయాలకతీతంగా ఖండించి అండగా నిలిచారని.. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం తమ నాయకుడి చావు కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ’



కాన్వాయ్‌ని అడ్డుకున్న బీజేపీ నాయకులు

సిద్దాపూర్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో సిద్దాపూర్‌కు చేరుకున్న కేటీఆర్‌.. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌తో ఎత్తిపోతల పథకం పనులు జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. శంకుస్థాపన అనంతరం బహిరంగ సభ స్థలానికి వస్తున్న సమయంలో బీజేపీ నాయకులు ఒక్కసారిగా ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. బాన్సువాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, బాన్సువాడలో ఇసుక మాఫియాకు పోచారం శ్రీనివా్‌సరెడ్డి, ఆయన కుటుంబసభ్యులు సహకరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.


గజ్వేల్‌లో లేనన్ని డబుల్‌ ఇళ్లు బాన్సువాడలో..

కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌లో కూడా నిర్మించనన్ని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి నిర్మించారని కేటీఆర్‌ ప్రశంసించారు. 119 నియోజకవర్గాల్లో అత్యధికంగా (10 వేల) ‘డబుల్‌’ ఇళ్లు బాన్సువాడలోనే నిర్మించారన్నారు. 

Updated Date - 2022-02-17T08:34:52+05:30 IST