Abn logo
Nov 30 2020 @ 04:40AM

బీజేపీవి పగటి కలలే

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూలటం.. గ్రేటర్‌లో ‘కమలం’ గెలవటం కల్లే

మోదీ లోక్‌సభ మధ్యంతర ఎన్నికలకు

వెళితే మాకేమీ అభ్యంతరం లేదు

ముస్లింలు ఆ పార్టీ శత్రువులా?

మోదీ నవాజ్‌ షరీఫ్‌తో బిర్యానీ తినలేదా?

ఇక్కడ మతం నిప్పు అంటించి వెళ్తే

తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యులెవరు?

బల్దియాలో 2016 ఫలితాలే పునరావృతం

ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ట్రైలర్‌ కాదు

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌


టీఆర్‌ఎస్‌ను కుటుంబ పార్టీ అనడం సరికాదు. మమ్మల్ని అనే ముందు బీజేపీలో ఏం జరుగుతోందో ఒకసారి చూసుకోవాలి. ఆ పార్టీ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ కొడుకు రాజకీయాల్లో లేరా? యడియూరప్ప కొడుకు లేరా? విజయరాజె సిందియా కుటుంబ సభ్యులు లేరా? మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీ పార్టీలో లేరా? వాళ్లా టీఆర్‌ఎ్‌సను కుటుంబ పార్టీ అనేది? ఒక వేలు ఇతరులను చూపించే ముందు, నాలుగు వేళ్లు మనల్ని చూపిస్తాయని గుర్తుంచుకోవాలి. మేం కొత్త సచివాలయ భవనం నిర్మిస్తే వాళ్లకు సమస్య. మరి వాళ్లు కొత్త పార్లమెంటు భవనం కట్టట్లేదా?


మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూలుతుందని, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ‘కమలం’ గెలుస్తుందని బీజేపీ, ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారు’’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కె.తారకరామారావు ఎద్దేవా చేశారు. ఈ రెండూ జరిగే పనులు కావని ఆయన స్పష్టంచేశారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో కేటీఆర్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు రావచ్చు’’ అంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభను రద్దు చేసి, మధ్యంతర ఎన్నికలకు వెళితే మాకు అభ్యంతరం లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, మేం సిద్ధమే. ఈ విషయంలో మాకు ఎలాంటి సమస్యా లేదు’’ అని వ్యంగ్యంగా బదులిచ్చారు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడ ఎన్నికలు జరిగినా హిందూ, ముస్లిం, పాకిస్థాన్‌ ప్రస్తావన తీసుకొచ్చి నాటకాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు.


‘‘పాకిస్థాన్‌ ఉగ్ర కార్యకలాపాలకు తగిన బుద్ధి చెప్పాలని ప్రతి భారతీయుడికీ ఉంటుంది. కానీ, బీజేపీ నేతలు దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లో పాకిస్థాన్‌ అంశాన్ని లేవనెత్తటం ఎందుకు? ఇదే ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు వెళ్లి నవాజ్‌ షరీ్‌ఫతో కలిసి బిర్యానీ తిని రాలేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘శత్రువులపై చేయాల్సిన సర్జికల్‌ స్ట్రైక్‌ను పాతబస్తీపై చేస్తామంటారు. ఇటువంటి మాటల అవసరం ఏమిటి? పాతబస్తీవాసులు, ముస్లింలు బీజేపీ శత్రువులా?’’ అని నిలదీశారు. ఇంకా ఏమన్నారంటే..


ప్రధాని కంటే మేయర్‌ పదవి ఎక్కువా? 

బీజేపీ నేతలు హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని అంటున్నారు. హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని చెబుతున్నారు. కేంద్రంలో ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారు కదా? హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే ఎవరు వద్దంటారు? ప్రధాని పదవి కంటే, మేయర్‌ పదవి ఎక్కువా? హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మార్చే అధికారం మేయర్‌కు ఉంటుందా? బల్దియా ఎన్నికల్లో పోయినసారి (2016) ఫలితాలే దాదాపుగా పునరావృతం అవుతాయి. అప్పుడు మేం (టీఆర్‌ఎస్‌) వంద డివిజన్లు గెలుస్తామని నేను చెబితే, అతి విశ్వాసం అన్నారు. 99 చోట్ల గెలిచాం. ఒక డివిజన్‌లో 5 ఓట్ల తేడాతో ఓడిపోవటం వల్ల ‘సెంచరీ’ మిస్‌ అయ్యాం.


ఇప్పుడు కూడా ఒకటి, రెండు స్థానాలు అటు, ఇటుగా పోయినసారి ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయి. ఇందులో నాకు ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు రాసుకోండి చెప్తున్నా.. ఈ ఎన్నికల్లో మేం ఎంఐఎం సిటింగ్‌ సీట్లు లంగర్‌హౌస్‌, రెడ్‌హిల్స్‌, విజయ్‌నగర్‌ కాలనీలో గెలుస్తాం. పాతబస్తీలోని 5 సిటింగ్‌  స్థానాలను నిలుపుకుంటాం. మొత్తంగా టీఆర్‌ఎస్‌ పాతబస్తీలో ఈసారి 10-12 డివిజన్లు గెలుస్తుంది.


మోదీ రాక సంతోషం 

ప్రధాని మోదీ నిన్నమొన్న భారత్‌ బయోటెక్‌కు వచ్చి ఉండొచ్చు. కానీ నేను మూడు నెలల ముందు అక్కడికి వెళ్లాను. కరోనా వ్యాక్సిన్‌ తయారీపై ఆరా తీశాను. అప్పుడు వాళ్లు.. వ్యాక్సిన్‌పై కేంద్రం తమను సంప్రదించలేదని, కలిసి పనిచేద్దామని చెప్పలేదని తెలిపారు. ఇదే విషయాన్ని వ్యాక్సిన్‌ తయారీ పరిశ్రమ మొత్తం చెప్పింది. ఏదేమైనా, చివరికి వ్యాక్సిన్‌ తయారీ పురోగతిపై సమీక్ష కోసం ప్రధాని మోదీ హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌కు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఆయన పర్యటనతో.. వ్యాక్సిన్‌ తయారీకి రాజధాని హైదరాబాద్‌ అనే విషయం ప్రపంచానికి, దేశానికి తెలిసింది. ఇది ఈ ఎన్నికల్లో మాకు సానుకూలాంశం కావచ్చు. ఇక.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తన మాటలతో తెలంగాణ ప్రజలకు వినోదం పంచుతున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనులకు విధించిన చలాన్లను జీహెచ్‌ఎంసీ చెల్లిస్తుందని అంటారు. అసలు లోక్‌సభలో అధికార బీజేపీ ఎంపీగా సంజయ్‌.. మోటారు వెహికల్‌ సవరణ చట్టానికి అనుకూలంగా ఓటేశారా? లేదా? అనే అనుమానం కలుగుతోంది.


యోగి లెక్చర్స్‌ ఇస్తారు..

ప్రధాని మోదీ బిహార్‌లో శాంతిభద్రతలను తప్పుపట్టారు. మరి బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటి? అలాంటిది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇక్కడికి వచ్చి లెక్చర్స్‌ ఇస్తారు. పేర్లు మార్చడం కాదు. ప్రజలకు పని చేసి చూపించాలి. మాది దమ్మున్న ప్రభుత్వం. మేం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం. మాకు పాఠాలు చెప్పే స్థితిలో ఇతర రాష్ట్రాల వాళ్లు లేరు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు రెండు, మూడు రోజుల్లో ఉన్నాయనగా, ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చారంటేనే.. ఈ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ నేతలు ఎంతగా తపిస్తున్నారో తెలుస్తోంది. కానీ, ప్రజలు తెలివైన వారు. అన్నీ అర్థం చేసుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎ్‌సకే పూర్తి మెజారిటీ వస్తుంది చూడండి!


టీఆర్‌ఎ్‌సను గెలిపిస్తేనే..

బిహార్‌ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో మోదీ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గెలిపిస్తేనే, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ గ్రోత్‌ ఉంటుందని అన్నారు. మరి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉంది కాబట్టి, స్థానిక సంస్థ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎ్‌సనే గెలిపిస్తేనే గ్రేటర్‌లో డబుల్‌ ఇంజన్‌ గ్రోత్‌ సాధ్యపడుతుంది. వివిధ పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇచ్చిన సొమ్మంతా తిరిగి రాష్ట్రానికి రావాలని చెప్పటానికి నేను పిచ్చివాడిని కాదు. కేంద్రానికి దేశ రక్షణ సహా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వెనుకబడిన రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం ఆ నిధులను ఖర్చు చేస్తుందనీ తెలుసు. అట్లా యూపీకి కూడా తెలంగాణ నిధులు వెళ్తాయి. అటువంటి రాష్ట్రాల వాళ్లు తెలంగాణకు వచ్చినప్పుడు థ్యాంక్స్‌ చెప్పాలి. కానీ అమిత్‌షా ఇదివరకు తెలంగాణకు వచ్చి వాళ్లు ఇచ్చేవాళ్లు, మేం తీసుకునే వాళ్లం అన్నట్లుగా రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. ఈ ధోరణి కరెక్ట్‌ కాదు. ఎవరు ఎవరికి నిధులిచ్చారు?


బీజేపీ కూడా ఫ్రెండే, కానీ..

మాకు రాజకీయంగా ప్రత్యర్థులు తప్ప, శత్రువులు లేరు. అలా చూస్తే, బీజేపీ కూడా మాకు ఫ్రెండే. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ తప్పులను తప్పనిసరిగా చెబుతాం. అలాగే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంగా మేం ఏదైనా చేయలేదని చెబితే, జవాబు ఇస్తాం! కానీ బీజేపీ నేతలు ఆ మాట మాట్లాడరు. వాళ్ల అజెండానే వేరు. మతం నిప్పు అంటించటం చాలా ఈజీ. ఇక్కడ నిప్పంటించి వెళ్లిపోతారు. తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అందుకే వారి పంథాపై మాకు అభ్యంతరం ఉంది. 


నాకది.. ఎంట్రీ పాస్‌ మాత్రమే

‘కేసీఆర్‌ కొడుకు’ అనేది నాకు రాజకీయాల్లోకి ఎంట్రీ పాస్‌ మాత్రమే. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఇప్పటికి నాలుగుసార్లు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక అవుతున్నా. దీని వల్ల ఇతరులకేంటి నష్టం? కావాలంటే నన్ను సిరిసిల్లలో ఓడించి, ఆ ప్రాంతానికి మేలు చేయాలి. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ అంతటి వాళ్లే ఓడిపోయారు. నేను అంతకంటే పెద్ద లీడర్‌ను కాదు కదా?


అసెంబ్లీ ఎన్నికలకు ఇది ట్రైలర్‌ కాదు.. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రస్తుత గ్రేటర్‌ ఎన్నికలు ట్రైలర్‌ కాదు. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. రోజురోజుకూ పరిస్థితులు మారుతాయి. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన మూడేళ్ల సమయం చాలా ఎక్కువ. 


ఎప్పుడేది మాట్లాడాలో సీఎంకు తెలుసు

సీఎం కేసీఆర్‌కు ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలుసు. బీజేపీ విధానాలను పార్లమెంటు, అసెంబ్లీలోనే ఎండగట్టాం. అందరి ముందు అరిస్తేనే, ఆ పార్టీని వ్యతిరేకించినట్టు కాదు. మేం చట్టాలు తెస్తే కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు జరిగాయి. కేంద్రం చట్టాలు తెస్తే రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మా కార్యాచరణను త్వరలో ముందుకు తెస్తాం.


రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు

బండి సంజయ్‌.. అసదుద్దీన్‌ ఒవైసీ.. చివరికి టీఆర్‌ఎస్‌ నేతలు.. ఇలా ఎవరైనా సరే.. మత విద్వేషాలను రెచ్చగొడితే, రాష్ట్ర ప్రభుత్వంగా ఉపేక్షించేది లేదు. చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోం.అమిత్‌ షా.. ఐటీఐఆర్‌ ఎక్కడ?

జాంబాగ్‌ డివిజన్‌తో సెంచరీ కొడతాం: కేటీఆర్‌

బేగంపేట, అఫ్జల్‌గంజ్‌, నవంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ కేంద్రం చేస్తమంటున్నరు. యూపీఏ హయాంలో ఇచ్చిన ఐటీఐఆర్‌ను రద్దు చేసిన మీరు నగరాన్ని ఐటీ హబ్‌గా చేస్తమంటే నమ్మాల్న? మీ బోడి మాటల్ని హైదరాబాదీలు, ఐటీ రంగంలో ఉండే ఇక్కడి పిల్లలు నమ్మరు’ అని కేంద్ర మంత్రి అమిత్‌ షాపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఐటీఐఆర్‌ను రద్దు చేసి తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టారని, ఇప్పుడొచ్చి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన సనత్‌నగర్‌, గోషామహల్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలు నిర్వహించి మాట్లాడారు. బీజేపీ నేతలు అంతమంది వస్తే.. సింహంలా కేసీఆర్‌ సింగిల్‌గా వస్తారన్నారు. అలాగే.. ఈ ఎన్నికల్లో జాంబాగ్‌ డివిజన్‌ను గెలిచి సెంచరీ కొడతామని ధీమా వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement