వర్షాలకు 70 మంది మృతి!

ABN , First Publish Date - 2020-10-20T07:30:20+05:30 IST

వందేళ్ల తర్వాత వచ్చిన ఉత్పాతమిది. భారీ వర్షం, వరదలతో జీహెచ్‌ఎంసీ, శివార్లలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలో 33 మంది, ఇతర ప్రాంతాల్లో 37 మంది...

వర్షాలకు 70 మంది మృతి!

  • జీహెచ్‌ఎంసీ, శివార్లలో 33 మంది 29 మంది కుటుంబాలకు పరిహారమిచ్చాం
  • వందేళ్ల తర్వాత వచ్చిన ఉత్పాతమిది
  • సగటు కంటే 80 శాతం అధిక వర్షపాతం
  • నష్టం 724 కోట్లని ప్రాథమిక అంచనా
  • 80 కాలనీలు, 54 అపార్ట్‌మెంట్లలో నీళ్లు
  • ఏపీ, కర్ణాటకల నుంచి పడవలు
  • అందుబాటులో 50 బోట్లు: మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘‘వందేళ్ల తర్వాత వచ్చిన ఉత్పాతమిది. భారీ వర్షం, వరదలతో జీహెచ్‌ఎంసీ, శివార్లలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలో 33 మంది, ఇతర ప్రాంతాల్లో 37 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70 మంది ప్రాణాలు కోల్పోయారు’’ అని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. పీర్జాదిగూడ, మల్కాజ్‌గిరి తదితర ప్రాంతాల్లో 30, 40 కాలనీల్లో తిరిగానని, ప్రజలు శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారని, నష్టపోయినందుకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పాథమిక అంచనా ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో రూ.724 కోట్ల నష్టం జరిగిందని, ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మరో మూడు రోజులు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో 80 మంది సీనియర్‌ అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించి, ముందస్తు జాగ్రత్త, పునరావాస చర్యలపై దృష్టి సారించామని వివరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 


‘‘40 ఏళ్లుగా నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. 2000లో బేగంపేటలో 24 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. తాజాగా ఘట్‌కేసర్‌లో 32 సెం.మీల వర్షం కురవగా.. చర్లపల్లిలో 30 సెం.మీలుగా నమోదైంది. హైదరాబాద్‌లో ఏడాది సగటు వర్షపాతం 77.9 సెం.మీలు కాగా.. ఇప్పటికే 120 సెం.మీ.లు కురిసింది. ఇది 80 శాతం అధికం. వర్షం ఉధృతి.. ఎంత సమయం.. ఎన్నిసార్లు పడుతుందన్న అంచనా వేయలేకపోతున్నారు. క్యుములోనింబస్‌ మేఘాల వల్ల అసాధారణ పద్ధతుల్లో వర్షాలు పడుతున్నాయి. దాంతో, ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీస్‌, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. అందువల్లనే చాలామంది ప్రాణాలు కాపాడగలిగామని అనుకుంటున్నాం. వేల మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించాం. వారికి భోజనం, మందులు, ఇతర అవసరాలు కల్పించాం’’ అని వివరించారు. మరో మూడు రోజులు ఉధృతంగా వర్షాలు కురవవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యల పర్యవేక్షణకు 80 మంది ప్రత్యేక అధికారులను నియమించామన్నారు.


 ‘‘జీహెచ్‌ఎంసీలో వారంపాటు అన్ని పనులు బంద్‌. కేవలం సహాయ, పునరావాస, పునరుద్ధరణ చర్యలపైనే దృష్టి. పునరావాస కేంద్రాల్లో అన్నపూర్ణ భోజనాలు అందుబాటులో ఉన్నాయి. కట్టుబట్టలతో చేరుకున్న వారికి అన్ని వసతులు కల్పిస్తున్నాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో 18,700 రేషన్‌ కిట్‌లు అందజేశాం. మరో 18,300 సిద్ధంగా ఉన్నాయి. నెలకు సరిపడా.. రూ.2800 విలువైన 11 వస్తువులు ఇస్తున్నాం’’ అని వివరించారు. ఇంకా 80 కాలనీలు, 54 అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ల్లో వరద నీరు ఉందని, పాతబస్తీ, ఎల్బీ నగర్‌లో సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ, శివారుల్లో 33 మంది మరణించినట్లు గుర్తించామని, వారిలో 29 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించామని తెలిపారు. వేల మందిని డీఆర్‌ఎఫ్‌, ప్రభుత్వ యంత్రాంగం కాపాడగలిగిందన్నారు.


శిథిల భవనాల కూల్చివేతకు స్పెషల్‌ డ్రైవ్‌

శిథిల భవనాల కూల్చివేతకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. జీహెచ్‌ఎంసీలో 541 శిథిల భవనాలను గుర్తించామని, ఇప్పటి వరకు 185 కూల్చివేశామని, గడిచిన వారం రోజుల్లోనే 59 నిర్మాణాలు కూల్చివేశామని వివరించారు. కోర్టు స్టే, ఇతరత్రా కారణాలతో సహకరించని సందర్భాల్లో పోలీసుల సహాయంతో బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించాలని, గ్రౌండ్‌ ఫ్లోర్‌ నీట మునిగితే కొందరు పై ఫ్లోర్‌కు వెళుతున్నారని, అలా కాకుండా, ఇళ్లు ఖాళీ చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తాత్కాలిక ఇబ్బంది కోసం ప్రాణాలు పణంగా పెట్టవద్దని హితవు పలికారు. ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. విష ప్రచారాలను నమ్మవద్దని, ప్రభుత్వ సమాచారాన్నే విశ్వసించాలని సూచించారు.


డల్లా్‌సలోనూ ఇంతే..!

‘ఇదేనా డల్లాస్‌.. ఇదేనా న్యూయార్క్‌ అని సోషల్‌ మీడియాలో వీడియోలు పెడ్తున్నారు. అయ్యా.. ఈ స్థాయిలో వర్షం పడితే డల్లాస్‌, న్యూయార్క్‌లో కూడా పరిస్థితులు ఇట్లనే ఉంటయి’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. విశ్వనగరాలుగా చెప్పుకునే సిటీల్లో కూడా వర్షాలు పెద్దఎత్తున వచ్చినప్పుడు, క్లౌడ్‌ బరస్ట్‌ అయినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ముంబై, చెన్నై, బెంగళూరుల్లోనూ ఇదే పరిస్థితి చూశామన్నారు.


కేంద్రం ఎంత ఇస్తుందో!?

పునరావాస చర్యలకు రూ.5 కోట్లు ఇస్తరా? అని కొందరు అర్ధరహితంగా మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ‘‘పునరావాస చర్యల కోసం ఇప్పటికే జీహెచ్‌ఎంసీ రూ.45 కోట్లు ఖర్చు చేసింది. వాటర్‌ బోర్డు, టీఎ్‌సఐఐసీ వంటి సంస్థలూ మరో రూ.15 కోట్లు వెచ్చించాయి. మరో రూ.724 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం’’ అని తెలిపారు. అక్టోబరు 17న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపిందని, ప్రధానితో సీఎం కేసీఆర్‌ మాట్లాడారని, తాత్కాలికంగా రూ.1350 కోట్లు ఇవ్వాలని కోరారని తెలిపారు. కేంద్రం నుంచి స్పందన రాలేదన్నారు.


ఏపీ, కర్ణాటక నుంచి పడవలు

బస్తీల నుంచి నిర్వాసితులను తరలించేందుకు పడవలు కావాలని, జీహెచ్‌ఎంసీ వద్ద 18 మాత్రమే ఉన్నాయని, ఏపీ, కర్ణాటక నుంచి 15 చొప్పున రానున్నాయని కేటీఆర్‌ తెలిపారు. 50 బోట్లు అందుబాటులో ఉంచుతామని, అవసరమైతే రంగంలోకి దిగాల్సి ఉంటుందని ఆర్మీకి చెప్పామని అన్నారు. ఈ పరిస్థితికి, ఒక ప్రభుత్వమో, వ్యక్తో, సంస్థనో కారణం కాదని చెప్పారు. ‘‘గుర్రం చెరువు, పల్లె చెరువు, అప్పా చెరువులు తెగడం వల్ల భారీ నష్టం జరిగింది. చెరువులు, నాలాలు అతిక్రమణకు గురయ్యాయని పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నా. అది వాస్తవమే. మా దగ్గర నివేదికలున్నాయి. ఎప్పుడు ఎక్కడ కబ్జా జరిగిందన్న వివరాలున్నాయి. చెరువులు, నాలాల ఆక్రమణలు ఈ గంటలోనో, ఒక్క రోజులోనో జరిగింది కాదు. మా దృష్టి అంతా రాబోయే మూడు రోజుల్లో ప్రాణ నష్టం జరగకుండా చూడడమే. తర్వాత మిగతా అంశాలు సావధానంగా మాట్లాడవచ్చు’’ అని అన్నారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు

Updated Date - 2020-10-20T07:30:20+05:30 IST