ప్రణాళికాబద్ధ అభివృద్ధి : కేటీఆర్‌

ABN , First Publish Date - 2022-01-26T14:29:02+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పానికి అనుగుణంగా హైదరాబాద్‌లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేపడుతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని

ప్రణాళికాబద్ధ అభివృద్ధి : కేటీఆర్‌

కుత్బుల్లాపూర్‌లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 

హైదరాబాద్/ దుండిగల్‌/జీడిమెట్ల: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పానికి అనుగుణంగా హైదరాబాద్‌లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేపడుతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దాదాపు రూ. 500 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపనలు చేశారు. 1100 ఎకరాల్లో గాజులరామారంలో ప్రాణవాయు పేరుతో ఏర్పాటు చేసిన అర్బన్‌ పార్కును, స్పోర్ట్స్‌ థీమ్‌తో ఏర్పాటు చేసిన మరో పార్కును, సుందరీకరించిన చింతల చెరువును కేటీఆర్‌ ప్రారంభించారు. ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు. నిజాంపేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో రోడ్ల వెడల్పు, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, మల్లంపేట్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు ఎంట్రీ, ఎగ్జిట్‌ ర్యాంప్‌లు, నాలుగు లైన్‌ల రోడ్ల పనులను తొమ్మిది నెలల వ్యవధిలో పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు రామలక్ష్మణుల్లా నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. వరద నీటి సమస్య పరిష్కారం కోసం మొదటి దశలో రూ.858 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రూ.248 కోట్లతో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఐదు సివరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 


కేంద్రం తీరు దారుణం

హెచ్‌ఎండీఏ పరిధిలో రూ. అయిదు వేల కోట్లతో రెండు స్కైవేలు నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన అని, దీనికి అడ్డుగా ఉన్న కంటోన్మెంట్‌ స్థలాన్ని తమకివ్వాలని కేంద్రాన్ని ఏడున్నర ఏళ్ల నుంచి ఇరవైసార్లు అడిగామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఆ స్థలానికి ప్రత్యామ్నాయంగా మరో స్థలమైనా, డబ్బు అయినా ఇస్తామని చెప్పినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. నగరంలో వరదలు వస్తే అరపైసా కూడా సాయం చేయని కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లో వరదలు వస్తే వెయ్యి కోట్లు ఇచ్చిందన్నారు. ఈసారి బడ్జెట్‌ సమావేశాల్లో హైదరాబాద్‌ అభివృద్ధి కోసం రూ.7,800 కోట్లు కావాలని కోరామని, దీని కోసం తెలంగాణ ఎంపీలు రాజీలేని పోరాటం చేయాలని కోరారు. కాగా, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కొవిడ్‌ నిబంధనలను ఎక్కడా పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2022-01-26T14:29:02+05:30 IST