ఆ ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్ల కలయిక...ఇరు పార్టీల్లో హాట్‌టాపిక్‌

ABN , First Publish Date - 2021-12-27T17:42:17+05:30 IST

అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఆ ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు.. ఒకే వేదికను పంచుకున్నారు. అంతేకాకుండా పరస్పరం పలకరించుకున్నారు. సంభాషించుకున్నారు. ఇలా వారిద్దరూ కనిపించడం.. ఇరు పార్టీల్లో హాట్‌టాపిక్‌గా మారింది...

ఆ ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్ల కలయిక...ఇరు పార్టీల్లో హాట్‌టాపిక్‌

అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఆ ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు.. ఒకే వేదికను పంచుకున్నారు. అంతేకాకుండా పరస్పరం పలకరించుకున్నారు. సంభాషించుకున్నారు. ఇలా వారిద్దరూ కనిపించడం.. ఇరు పార్టీల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అంతేగాక ఆ ఇద్దరి కలయిక అక్కడి అధికార పార్టీ నాయకుడి అనుచరులను తెగ టెన్షన్‌ పెడుతోంది. అసలు ఆ ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు ఎవరు? వారి మధ్య జరిగిన చర్చేంటి? వారిద్దరూ కలుసుకోవడం ఎందుకంత ఆసక్తిగా మారింది? టెన్షన్‌కు గురవుతున్నదెవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


ప్రతిపక్ష నేతతో ఆయన వ్యవహరించిన తీరు ఆసక్తికరం

తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ఇటీవల సంగారెడ్డి జిల్లాలో చేసిన పర్యటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అమాత్యుడి పర్యటనకు అంత ప్రాధాన్యం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? అసలు విషయం ఏమిటంటే.. సాధారణంగా జిల్లాకు మంత్రి వచ్చి వెళ్తే పర్వాలేదు. కానీ ప్రతిపక్ష నేతతో ఆయన వ్యవహరించిన తీరే ఇక్కడ ఆసక్తికరంగా మారింది.


కేటీఆర్‌తో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చనువు..

సంగారెడ్డి కలెక్టరేట్‌లో అంతిమయాత్ర వాహనాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ రెండు కార్యక్రమాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కాబట్టి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హాజరుకావడం వరకు ఓకే.. కానీ మంత్రి కేటీఆర్‌తో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చనువుగా ఉండటం, సరదాగా సంభాషించడం వంటివి ప్రత్యేకత సంతరించుకున్నాయి. కలెక్టరేట్ జరిగిన కార్యక్రమంలో కేటీఆర్, జగ్గారెడ్డిలు తమ వాళ్లను బాగా చూసుకోవాలంటే.. తమ వాళ్లను చూసుకోవాలంటూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత జరిగిన సభలో ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. గుసగుసలాడారు. నవ్వులు చిందిస్తూ సంభాషించారు.


ఆశ్చర్యానికి గురైన ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు

మామూలుగా ఏదైనా కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష నేతలు కలుసుకుంటే ఎడమొహం, పెడమొహంగా ఉంటారు. కానీ ఇక్కడ అలా కాకుండా కలివిడిగా గడిపారు. తమ పార్టీల వర్కింగ్ ప్రెసిండెంట్‌ల తీరు చూసి ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. నిత్యం టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగే జగ్గారెడ్డితో కేటీఆర్ స్నేహపూర్వకంగా మెలగడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అదీగాక కేటీఆర్‌ తన ప్రసంగంలో.. "ఎన్నికలప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు... ఇప్పుడు  మాత్రం అభివృద్ధిం కోసం కలిసి పని చేయాలి" అని కోరడం ఆసక్తికరంగా మారింది. దీంతో కేటీఆర్ వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటన్నది టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో విస్తృతచర్చకు దారితీసింది. తాము ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల పట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదనడానికి సంకేతంగా కేటీఆర్ అలా మాట్లాడారే తప్ప.. రాజకీయపరమైన కోణం లేదని కొందరు గులాబీ నేతలు సర్దిచెబుతున్నా.. లోలోన మాత్రం వారు కూడా ఇలా మాట్లాడటంలో అంతర్యం ఏమిటని ఆరా  తీస్తున్నారు.


ఇరుపార్టీల క్యాడర్‌లో భిన్నరకాలుగా చర్చ 

ఎన్నికల్లో తన ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతా ప్రభాకర్‌ను  స్టేజీపైకి పిలవాలంటూ జగ్గారెడ్డి కోరారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇలా రెండు పార్టీల ముఖ్యనేతల వ్యవహార శైలిపై ఇరుపార్టీల క్యాడర్‌లో భిన్నరకాలుగా చర్చ సాగుతోంది. జిల్లాకు రాకరాక వచ్చిన కేటీఆర్.. సంగారెడ్డిలో పెద్ద రాజకీయ చర్చకే తెరతీశారని టాక్ నడుస్తోంది. రెండు పార్టీల కీలక నేతల మాటలు, సంభాషణలు ఏ పార్టీకి లాభనష్టాలు కలిగిస్తాయనే అంశాన్ని పక్కనపెడితే.. ఎవరూ ఊహించని విధంగా ఈ పరిణామాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే కేటీఆర్ పర్యటనకు ఉమ్మడి జిల్లా మంత్రి హరీశ్‌రావు దూరంగా ఉండటం, ఇదే కేటీఆర్, జగ్గారెడ్డి కలుపుగోలుగా ఉండటంపై రకరకాల చర్చకు దారితీసింది.


జగ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడి కారెక్కుతారనే ప్రచారం..?

ఇదిలావుంటే, కేటీఆర్, జగ్గారెడ్డిల తీరు.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీఆర్ఎస్‌ ఇన్‌చార్జి చింతా ప్రభాకర్ అనుచరగణాన్ని కలవరపెడుతోందట. 2018 ఎన్నికల్లో జగ్గారెడ్డి స్వల్ప ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన చింతా ప్రభాకర్‌పై విజయం సాధించారు. ఆ తర్వాత జగ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడి కారెక్కుతారనే ప్రచారం సాగింది. కానీ ఆయన పార్టీ మారలేదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవి దక్కింది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో ఉన్న విభేదాల నేపథ్యంలో టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం ఇప్పటికీ ఉన్నా.. జగ్గారెడ్డి మాత్రం పార్టీ మారేది లేదని పలుమార్లు తేల్చి చెప్పారు. తాజాగా కేటీఆర్, జగ్గారెడ్డి స్నేహపూర్వకంగా మెలగడంతో ఆ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. కేటీఆర్ తన ప్రసంగంలో.. "సంగారెడ్డి అభివృద్ధి కోసం జగ్గారెడ్డి, ప్రభాకర్‌ కలిసి పనిచేయాలి" అని కోరడం చర్చకు ఊతమిచ్చింది. 


చింతా ప్రభాకర్‌ అభిమానులు, కార్యకర్తలకు మింగుడుపడటం లేదంట..?

చింతా ప్రభాకర్‌కు కేసీఆర్ నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇంకా మోక్షం కలగలేదు. దీనికితోడు జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతారంటూ ఇప్పటికే జరుగుతున్న ప్రచారం.. చింతా ప్రభాకర్‌ అభిమానులు, కార్యకర్తలకు మింగుడుపడటం లేదు. ఈ క్రమంలో కేటీఆర్‌తో జగ్గారెడ్డి సాన్నిహిత్యం ఎక్కడ తనకు ఇబ్బందికరంగా మారుతుందోనని చింతా ప్రభాకర్‌, ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారట. జగ్గారెడ్డి పార్టీలో చేరితే తమ పరిస్థితి ఏమిటని టెన్షన్‌కు గురవుతున్నారట. ఈ పరిణామాలు మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో అని ఆయా పార్టీల నేతలు గుసగుసలాడుతున్నారు. 

Updated Date - 2021-12-27T17:42:17+05:30 IST