ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నయం : కేటీఆర్

ABN , First Publish Date - 2021-05-13T01:42:53+05:30 IST

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితి నియంత్రణలోనే ఉందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నయం : కేటీఆర్

హైదరాబాద్: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితి నియంత్రణలోనే ఉందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారని, తెలంగాణలో కేసులు తగ్గుతున్నాయని కేంద్ర మంత్రులే చెబుతున్నారని పేర్కొన్నారు. కరోనా కట్టడిపై మంత్రి కేటీఆర్ సారథ్యంలో సీఎం కేసీఆర్ ఓ టాస్క్‌ఫోర్స్‌ను నియమించారు. ఆ టాస్క్‌ఫోర్స్ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన బుధవారం మొదటిసారిగా భేటీ అయ్యింది. రాష్ట్రంలో పూర్తి స్థాయి బెడ్లు, ఆక్సిజన్, రెమిడేసివిర్ ఇంజక్షన్లు అందుబాటులోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రతి రోజూ ఆస్పత్రిల్లో వాడే ఆక్సిజన్‌పై వివరాలున్నాయని, మితిమీరిన ఇంజక్షన్లు, అనవసర ఆందోళనలు వద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య అధికారులతో రోజూ మాట్లాడుతున్నారని, రాబోయే రోజుల్లో టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్, రెమిడేసివిర్, ఆక్సిజన్ ఉత్పత్తిపై సమావేశమవుతామని కేటీఆర్ ప్రకటించారు.


ఇప్పటి దాకా పెద్ద ఎత్తున ఇంటి ఇంటికి సర్వే చేస్తూ, అవసరం అయిన వారికి మెడికల్ కిట్స్ ఇస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూరైందని ప్రకటించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వల్ల వేలాది మందిని కాపాడగలమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బెడ్స్‌ను భారీగా పెంచామని, అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సైతం భారీగా పెంచామని తెలిపారు. ఆక్సిజన్ సప్లై గురించి కూడా చర్చించామని, ప్రస్తుతానికి అవసరమైన డిమాండ్ సప్లై విషయంలో వివరాలు తీసుకున్నామని, ఆక్సిజన్ ఆడిట్‌ను ప్రభుత్వం చేస్తుందని ప్రకటించారు. ఎప్పటికప్పుడు కరోనా కట్టడికి చర్యలను ముమ్మరం చేస్తున్నామని, మరింత సమగ్రంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని మంత్రి ప్రకటించారు. టాస్క్‌ఫోర్స్ సమావేశాలు వరుసగా కొనసాగే ఒక సమగ్ర కార్యాచరణ దిశగా ముందుకు వెళ్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 

Updated Date - 2021-05-13T01:42:53+05:30 IST