అలా అయితే ప్రధాని ఫెయిల్ అయినట్లేనా?: కేటీఆర్

ABN , First Publish Date - 2020-07-14T01:00:08+05:30 IST

కరోనా విజృంభన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష పార్టీలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలపై మంత్రి కేటీఆర్ సున్నితంగా స్పందించారు. కరోనా

అలా అయితే ప్రధాని ఫెయిల్ అయినట్లేనా?: కేటీఆర్

మహబూబ్‌నగర్: కరోనా విజృంభన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష పార్టీలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలపై మంత్రి కేటీఆర్ సున్నితంగా స్పందించారు. కరోనా నివారణలో కేసీఆర్ ఫెయిల్ అని విపక్ష నేతలు అంటున్నారని, మరి ప్రపంచంలోనే కరోనా వ్యాప్తిలో భారత్ మూడవ స్థానంలో ఉందని, దాని ప్రకారం ప్రధాని మోదీ ఫెయిల్ అని అందామా? అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా లాంటి అతిపెద్ద విపత్తులో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని, కానీ వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయవొద్దని విపక్షాలకు ఆయన హితవు చెప్పారు. కరోనాపై ప్రజల్లో అపోహలు తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా విషయంలో కలిసి రావాలని విపక్షాలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారమే పరీక్షలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పెద్ద మొత్తంలో కరోనా కేసుల్లో 98 శాతం మంది బాధితులు రికవరీ అవుతున్నారని, 2 శాతం మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. విపక్ష నేతలు ఆ 2 శాతంపైనే ఫోకస్ చేయడం సరికాదన్నారు. కాగా, కోవిడ్ 19 తర్వాత ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలా మంది పేషెంట్లను తిరస్కరించినా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందించామని చెప్పుకొచ్చారు. శవాలను తీసుకెళ్లేందుకు కూడా బంధువులు రావడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. 


వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మిస్తాం..

జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ భవనాన్ని మంత్రి కేటీఆర్.. ఇతర మంత్రులు ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో ఏ వైద్య కాళాశాల కూడా ఇంత మంచి వాతావరణంలో లేదన్నారు. ఇది ఓ అద్భుత కాలేజీగా మారుతుందని పేర్కొన్నారు. త్వరలో ఇక్కడే వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కేసీఆర్ కిట్ వల్ల, వైద్య శాఖ సిబ్బంది చొరవ వల్ల, ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య చాలా పెరిగిందని చెప్పారు. 


దేశంలో ఫార్మారంగం వృద్ధి..

నేడు భారతదేశంలో ఫార్మా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీ చేసేందుకు పోటీ పడుతున్నాయని, ఆ కంపెనీల్లో ఇండియాకు చెందిన ఆరు కంపెనీలో ఉన్నాయని చెప్పారు. ఇక ఆ ఆరు కంపెనీల్లో నాలుగు తెలంగాణ రాష్ట్రానికి చెందినవేనని పేర్కొన్నారు. కరోనాపై పోరాటం సాగిస్తున్న తరుణంలో వైద్యుల, ప్రభుత్వ పెద్దల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కాకుండా ప్రతిపక్షాలు సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. 

Updated Date - 2020-07-14T01:00:08+05:30 IST