తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం: KTR

ABN , First Publish Date - 2022-06-04T01:23:31+05:30 IST

మానవ వనరులు, ఆర్థిక వనరులు అందచేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామరావు(ktr) అన్నారు

తెలంగాణను  అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం: KTR

హైదరాబాద్: మానవ వనరులు, ఆర్థిక వనరులు అందచేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామరావు(ktr) అన్నారు.శుక్రవారం నానక్ రామ్ గూడలో హెచ్ జి సిఎల్(hgcl) కార్యాలయంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ 2021-2022 వార్షిక నివేదికను(annual report) ఆయన విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 8 సంవత్సరముల నుండి స్ఫష్టమైన ఎజెండాతో పని చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లుతున్నామని అన్నారు. అందులో భాగంగా 12 వేల 769 గ్రామాలలో, 142 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు, రహదారులు, వీధిలైట్లు, ఫ్లైఓవర్స్, సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  


హరిత హారం చేపట్టి  రాష్ట్రములో పచ్చదనం పెంపొందించామన్నారు. రాష్ట్రములోని ప్రతి ఉద్యోగి బాగా పని చేయడం వలన అభివృద్ధి జరిగిందన్నారు. పారదర్శకంగా పని చేస్తున్నపుడు ప్రతి ఏడాది ప్రగతి నివేదిక విడుదల చేస్తున్నామని తెలిపారు. అద్భుతంగా పని చేస్తున్న మున్సిపల్‌, పట్టణాభివృద్ధి అధికారులను అభినందించారు. కరోనా కాలంలో మున్సిపల్‌ సిబ్బంది బాగా పని చేశారని, వైద్య సిబ్బందితో కలిసి కరోనా టీకాలు వేయడంలో మున్సిపల్‌ సిబ్బంది పాత్ర మరచిపోలేమని మంత్రి అన్నారు.త్వరలో 50 వేల జనాభా ఉన్న ప్రతి మున్సిపాలిటీలో వార్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు ఏర్పాటు చేస్తామని, 141 మున్సిపాలిటీల్లో రూ.3700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రతి నెలా మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. 


అన్ని పట్టణాల్లో టెన్‌ పాయింట్‌ ఎజెండాతో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి జిల్లాకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ పోస్టు ఉందన్నారు. ఈ ఏడాది అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని అన్నారు. దేశంలో టాప్‌ 10 నగరాలు తెలంగాణ నుంచే ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి, జలమండలి ఎండి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-04T01:23:31+05:30 IST