రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు ఘనత కేసీఆర్‌దే: కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-08-30T23:46:27+05:30 IST

దేశ స్వాతంత్య్ర చరిత్రలో ఏరాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్‌ అనేక రైతు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు ఘనత కేసీఆర్‌దే: కేటీఆర్‌

హైదరాబాద్‌: దేశ స్వాతంత్య్ర చరిత్రలో ఏరాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్‌ అనేక రైతు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచం అబ్బురపడే విధంగా స్వల్పకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సోమవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన అగ్రిఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. 


ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందన్నారు. స్వయంగా ఎఫ్‌సీఐ ఈ విషయాన్ని ధృవీకరించిందని అన్నారు. ఒకప్పుడు దేశంలో ఆహార భద్రత ఒక సవాల్‌గా ఉండేదని, దీన్ని విజయవంతంగా అధిగమించామన్నారు. వైవిధ్యానికి ఆలవాలమైన దేశంలో విభిన్న ఆహారపు అలవాట్లు ఉన్నాయన్నారు. పౌష్టికాహార భద్రత సాధించడం నేడు మన ముందున్న సవాల్‌ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరుగుతున్నాయని తెలిపారు. 


ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్‌ని సైతం అధిగమించిందన్నారు. అయితే పెరుగుతున్నఉత్పత్తులకు అనుగుణంగా వ్యవసాయాధారిత పరిశ్రమలు మరిన్ని రావాలన్నారు. ఈసందర్భంగా అగ్రిహబ్‌కి సంబంధించిన పుస్తకాల్ని విడుదల చేశారు. కొన్ని  ఉత్పత్తులను కూడా మంత్రి ప్రారంభించారు. కొన్నిసంస్ధలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ డా. ప్రవీణ్‌రావు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, వర్శిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్ధినీ విద్యార్ధులు , అగ్రి హబ్‌ ఎండి డాక్టర్‌ కల్పనా శాస్ర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-30T23:46:27+05:30 IST