గ్రేటర్ లో సిద్ధంగా మరో 70వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు: కేటీఆర్

ABN , First Publish Date - 2021-08-28T22:43:14+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పూర్తై లబ్దిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు.

గ్రేటర్ లో సిద్ధంగా మరో 70వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు: కేటీఆర్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పూర్తై లబ్దిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు. చంచల్ గూడా సమీపంలోని పిల్లి గుడిసెలు లో ఇన్- -సిటు పద్దతిలో రూ. 24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు శనివారం ఉచితంగా అందచేశారు. రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, హైదరాబాద్ ఎం.పి. అసదుద్దీన్ ఒవైసి, మలక్ పేట్ శాసన సభ్యులు అహ్మద్ బిన్ బలాల, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ జాఫ్రి, నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్  తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 


ఈ సందర్బంగా మంత్రి కె.టి.ఆర్. మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న  రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఆకాంక్ష మేరకు రూ. 9700 కోట్ల వ్యయంతో ఒక లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. వీటిలో కొద్దీ పనుల మినహా త్వరలోనే దాదాపు 70 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్దిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.రాష్ట్రంలోనూ రూ. 18 ,000 వేల కోట్ల వ్యయంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఇళ్ల నిర్మాణం లో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజి పడలేదని దీనికి నిదర్శనం ఈ పిల్లి గుడిసెలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కు ఉపయోగించిన పేరొందిన కంపెనీ కి చెందిన లిఫ్ట్ ఉదాహరణ అని అన్నారు. 


హైదరాబాద్ నగరంలో నాలుగు దిక్కులా ఒక్కొక్కటి నాలుగు మల్టి స్పెషాలిటీ  ఆసుపత్రులను నిర్మించాలని సి.ఎం. కేసీఆర్ నిర్ణయించారని అన్నారు. దీనిలో భాగంగా గచ్చి బౌలిలో ఇప్పటికే టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించామని అన్నారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకున్నందున అక్కడ ఆధునాతన ఆసుపత్రిని నిర్మించాలన్న ఎం.పి అసదుద్దీన్ విజ్ఞప్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానని అన్నారు. అదేవిధంగా చంచల్ గూడా జైలు ను శివారు ప్రాంతాలకు తరలించి ఈ స్థలంలో విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలు, ఆసుపత్రి ని నిర్మించాలన్న డిమాండ్ ను కూడా సి.ఎం తో చర్చించనున్నట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను గతంలో ఎన్నడూ లేని విధంగా చేపట్టామని అన్నారు . మూసి శుద్ధి కార్యక్రమo లో భాగంగా ప్రస్తుతం ఉన్న ఎస్.టి.పి లకు తోడుగా మరో 335 ఎస్.టి.పి లను నిర్మించనున్నామని తెలిపారు. 


హైదరాబాద్ నగరమంటేనే చార్మినార్ తో ప్రపంచ ప్రసిద్ధి చెందిందని, పాత బస్తి సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కృత నిశ్యయంతో ఉందని స్పష్టం చేశారు. మైనారిటి పిల్లల విద్యాభివృద్ధికి గతంలో ఎన్నడూ ఎన్ని విధంగా పెద్ద ఎత్తున మైనారిటీ గురుకుల పాలశాలలు ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ సందర్బంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, కరోనా తో లాక్ డౌన్ ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరంలో రహదారుల నిర్మాణం, ఫ్లయ్ ఓవర్లు తదితర పనులు ముమ్మరంగా నడిచాయని అన్నారు. ఎం.పి అసదుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ, చంచల్గూడ జైలును శివారు ప్రాంతాలకు తరలించి ఈ స్థలంలో కళాశాలను, విద్యా సంస్థలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా ఆసుపత్రి లో కొత్త భవనం నిర్మించేందుకు రూ. 500 కోట్లను కేటాయించాలని కోరారు.  కాగా, ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించిన అనంతరం లాటరీ పద్దతిలో  ఇళ్లను లబ్దిదారులకు అంద చేశారు.

Updated Date - 2021-08-28T22:43:14+05:30 IST