Abn logo
Jun 15 2021 @ 03:24AM

పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ

తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్‌ మీట్‌లో మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ప్రపంచ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం  ఆకర్షణీయమైన గమ్యస్థానమని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి స్నేహపూర్వక విధానాలతో ఏడేళ్లుగా తెలంగాణలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగినట్టు ఆయన పేర్కొన్నారు. సోమవారం సౌదీలోని భారత రాయబార కార్యాలయం.. తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్‌ మీట్‌ పేరిట ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు.


సౌదీలోని భారత రాయబార కార్యాలయం, సౌదీ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. రెండురోజుల పాటు జరగనున్న సదస్సులో తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలను పరిశ్రమల శాఖ తో పాటు వివిధ శాఖల అధికారులు సౌదీ పెట్టుబడిదారులకు వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం.. భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన టీఎస్‌-ఐపాస్‌ వంటి సింగిల్‌ విండో అనుమతుల విధానాన్ని అనుసరిస్తున్నట్టు చెప్పారు. టీఎ్‌స-ఐపాస్‌ ద్వారా ఇప్పటికే తెలంగాణ దాదాపు 2,200 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని, తద్వారా 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించిందన్నారు. 


ఐటీ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఏరోస్పస్‌, డిఫెన్స్‌ తదితర రంగాల్లో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సౌదీ కంపెనీలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తామన్నారు. తెలంగాణతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సౌదీ రాయబారి అసఫ్‌ సయీద్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రాయబారి అశోక్‌, సౌదీ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ ఖతానీ, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టీఎ్‌సఐఐసీ ఎండీ వెంకట నరసింహ  రెడ్డి పాల్గొన్నారు.