నేనూ నచ్చకుంటే ‘నోటా’కెయ్యండి

ABN , First Publish Date - 2020-11-29T07:32:18+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఉద్యోగులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఈ విషయంలో కుటుంబసభ్యులను, స్నేహితులను ప్రోత్సహించాలని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. విద్యావంతులకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు. ‘‘చదువుకున్నవారంతా ట్వీట్లు చేస్తరు కానీ

నేనూ నచ్చకుంటే ‘నోటా’కెయ్యండి

చదువుకున్నవారు ట్వీట్లుమాని పోలింగ్‌ రోజు బూత్‌లకు రండి

బండి సంజయ్‌, అక్బరుద్దీన్‌ ఇద్దరూ పిచ్చోళ్లే 

వాళ్లను గెలిపిస్తే హైదరాబాద్‌ కర్ఫ్యూల నగరమే: కేటీఆర్‌

చదువుకున్నవారు ట్వీట్లు చేస్తరు.. కానీ ఓట్లు వేయరు

దయచేసి ఓటు హక్కు వినియోగించుకోండి

రోహింగ్యాలుంటే ఆరేళ్లుగా నిద్రపోయారా?: కేటీఆర్‌


హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఉద్యోగులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఈ విషయంలో కుటుంబసభ్యులను, స్నేహితులను ప్రోత్సహించాలని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. విద్యావంతులకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు. ‘‘చదువుకున్నవారంతా ట్వీట్లు చేస్తరు కానీ ఓట్లు మాత్రం వెయ్యరు. డిసెంబరు-1న ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో కామెంట్లు కాసేపు ఆపి పోలింగ్‌ బూత్‌లకు రండి. బయట ఉన్న మీ కుటుంబసభ్యులు, మిత్రులను కూడా పిలిచి ఓటుహక్కు వినియోగించుకోవాలని చెప్పండి. దయచేసి ఓటు వెయ్యం డి. నేనూ (టీఆర్‌ఎస్‌) నచ్చకపోతే నోటాకు అయినా వేయండి’’ అని కోరారు.


శనివారం వివిధ పారిశ్రామిక సంఘాల ఆధ్వర్యంలో మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో.. బేగంపేటలోని రెండు హోటళ్లలో నిర్వహించిన సదస్సుల్లో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. మజ్లిస్‌, బీజేపీని గెలిపిస్తే గతంలో మాదిరిగా హైదరాబాద్‌ కర్ఫ్యూల నగరంగా మారుతుందని, ప్రశాంతంగా ఉంటున్న హిందు, ముస్లిం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తారా ని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డిస్టర్బ్‌ అయితే తెలంగాణ డిస్టర్బ్‌ అవుతుందన్నారు. ‘‘బీజేపీ నేత బండి సంజయ్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌ అంటరు.. మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ కూల్చేయండి అంటరు. ఇద్దరూ పిచ్చోళ్లే. వీరికి జీహెచ్‌ఎంసీ పీఠం ఇవ్వడం అంటే పిచ్చోడి చేతికి రాయివ్వటమే. సర్జికల్‌ స్ట్రయిక్‌ చేయడానికి హైదరాబాద్‌ ఏమైనా శత్రుదేశమా? అని ప్రశ్నించారు. ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారని కేంద్రమంత్రులు చెబుతున్నారని, వారికి ఓటర్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు ఇచ్చింది కేంద్రప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. రోహింగ్యాలు నిజంగానే ఉంటే ఆరేళ్లుగా కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి నిద్రపోయారా? అని మండిపడ్డారు. గత ఆరేళ్లలో వేలకోట్లతో నగరంలో అభివృద్ధి చేపట్టామని, ఇది కొనసాగాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే పట్టం కట్టబెట్టాలని ఆయన కోరారు.  


కేంద్రం నినాదం బేచో ఇండియా

కేంద్రప్రభుత్వం కొత్తగా బేచో ఇండియా పథకం అమలు చేస్తోందని కేటీఆర్‌ దుయ్యబట్టారు. ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారంటే సమాధానం ఉండదని, దీనిపై ప్రజలు ఆలోచించాలన్నారు. కరోనా సమయం లో రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీని మోదీ ప్రకటించారని, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేశారో  అర్థం కావడం లేదన్నారు. రూ. 20 లక్షల కోట్లను దేశంలోని 132 కోట్ల జనాభాకు పంచినా ప్రతిఒక్కరికీ రూ. 15,384 వచ్చేదన్నారు. వరుసగా 8 త్రైమాసికాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్‌, శ్రీలంక కంటే ఘోరంగా దిగజారిందని, ఇలా అయితే 2024లోపు 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ‘‘ప్రచారానికి కేంద్ర మం త్రులు వస్తున్నారు. యూపీ సీఎం యోగి వచ్చారు. ఇక్కడ ఇరానీ చాయ్‌ అదిరిపోతుంది. బిర్యానీ బ్రహ్మాండంగా ఉంటుంది. బిర్యానీ తిని, చాయ్‌ తాగి వెళ్లండి. కానీ ప్రజల మధ్య విద్వేషాలు పెంచొద్దు. భావోద్వేగాలు రెచ్చగొట్టద్దు’’ అని పేర్కొన్నారు. వరదలొస్తే నీట మునగని నగరాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ముంబై, చెన్నై, బెంగళూరు, పట్నాలో అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంటుందని.. పట్నాలో వరదలొచ్చినప్పుడు బీజేపీ నేత సుశీల్‌ కుమార్‌ మోదీని పడవలో తీసుకురలేదా అని ప్రశ్నించారు. నగరంలో మజ్లిస్‌, బీజేపీలు అలజడులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని.. ఇది తమ పార్టీ వాళ్లకూ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.


బీజేపీ అతీతమా?

 కుటుంబ పార్టీ అని టీఆర్‌ఎ్‌సను కేంద్రమంత్రులు విమర్శిస్తున్నారని, బీజేపీ మాత్రం కుటుంబ రాజకీయాలకు అతీతమా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కర్ణాటకలో యాడ్యురప్ప కుమారుడు, రాజస్థాన్‌లో వసుందర రాజే, దుష్యంత్‌, మధ్యప్రదేశ్‌లో విజయరాజే, యశోధరా, జ్యోతిరాదిత్య, ఢిల్లీలో మేనక గాంధీ, వరుణ్‌ గాంధీ లేరా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి కుటుంబం లేదు కాబట్టి ఆయనది వేరే విషయం అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. గత 10 ఉప ఎన్నికల్లో ఒక్క దుబ్బాకలోనే ఓడామని, దాంతో తమ ప్రభుత్వం కూలిపోయేదేమీ లేదన్నారు.  

Updated Date - 2020-11-29T07:32:18+05:30 IST