10 వేలు తాత్కాలికమే!

ABN , First Publish Date - 2020-10-21T08:28:01+05:30 IST

వరద బాధిత కుటుంబాలకు ఇస్తున్న రూ.10 వేలు తాత్కాలిక, తక్షణ సహాయం మాత్రమేనని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

10 వేలు తాత్కాలికమే!

అవసరమైతే సర్కారు సాయం పెంచుతాం

సహాయక చర్యలను పర్యవేక్షించాలని జీహెచ్‌ఎంసీ ప్రజాప్రతినిధులకు కేటీఆర్‌ ఆదేశం

వరద ప్రభావిత కాలనీల్లో మంత్రి పర్యటన

బాధితులకు సాయం అందించిన కేటీఆర్‌


మధ్య బంగాళాఖాతం, ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం ఉదయం 8.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో... ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం వాయవ్య దిశగా ప్రయాణించి, ఆ తర్వాత 3 రోజుల్లో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించవచ్చని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవవచ్చని ప్రకటించింది. 


హైదరాబాద్‌ సిటీ/మన్సూరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వరద బాధిత కుటుంబాలకు ఇస్తున్న రూ.10 వేలు తాత్కాలిక, తక్షణ సహాయం మాత్రమేనని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అవసరమైతే సాయాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌, పరిసరాల్లో 3-4 లక్షల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని వెల్లడించారు. ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా పాడైన వారికి అదనపు పరిహారం అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పది రోజులపాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ, పునరుద్ధరణ చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో వరద సహాయక చర్యలకు సంబంధించి మంగళవారం ప్రగతిభవన్‌లో జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు.


వచ్చే పది రోజులు ప్రతి ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లో నగదు సాయం అందిస్తూనే.. సహాయక చర్యలు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశీలించి.. అక్కడి వసతులు, సహాయక చర్యలను పరిశీలించాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదో చూడాలని తెలిపారు. శానిటేషన్‌ డ్రైవ్‌ను పర్యవేక్షించాలన్నారు. వరద బాధితుల సహాయార్థం గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ రెండు నెలల వేతనం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని కేటీఆర్‌ అభినందించారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో కేటీఆర్‌ ప్రతి ఎమ్మెల్యేని వారి వారి నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సాయం ప్రతి ఒక్కరికీ అందాలని స్పష్టం చేశారు. పక్కదారి పట్టకుండా చూడాలని, అలాగైతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. ఈ క్రమంలో సాయం అందించిన వారి ఆధార్‌ వివరాలు తీసుకోవాలని ఓ ఎమ్మెల్యే సూచించగా.. కేటీఆర్‌ దానికి ఆమోదం తెలిపారు.


అనంతరం ఆయన ఖైరతాబాద్‌లోని ఎంఎస్‌ మక్తా, షేక్‌పేట, నదీం కాలనీ, నాగోల్‌, లింగోజిగూడలో ముంపు బాధిత కుటుంబాలను పరామర్శించారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.10 వేల తక్షణ సాయాన్ని నగదు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. వరద బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, వారి కోసం అవసరమైనన్ని నిధులు ఖర్చు చేస్తామని చెప్పారు. నగరంలో బాధితులందరికీ సహాయం అందిస్తామన్నారు. అధికారులు బాధితుల ఇళ్ల వద్దకే వచ్చి నగదు ఇస్తారన్నారు. విపత్కర సమయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, ఎన్‌జీవోలు కలిసి ప్రజలకు సాయం అందించడంలో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో భరోసా నింపేందుకే కాలనీల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. నగరంలో రాబోయే ఒకట్రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వరద నివారణకు శాశ్వత పరిష్కారాల కోసం ప్రయత్నం చేస్తామన్నారు. కాగా.. వర్షాలు, వరద బీభత్సం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వాయిదా పడతాయా అన్న ప్రశ్న వచ్చినప్పుడు షెడ్యూల్‌ ప్రకారమే జరిగే అవకాశం ఉందని కేటీఆర్‌ అన్నట్లు తెలిసింది. నగరంలో వరదల వల్ల అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో.. తాజాగా కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం చేయడంతో పరిస్థితులు మారతాయని, టీఆర్‌ఎస్‌ పట్ల సానుభూతి రావచ్చని అంటున్నారు. ఈ క్రమంలో వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత ఎన్నికలపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


శాశ్వత పరిష్కారం చూపుతాం

ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌లతో కలిసి నాగోలు డివిజన్‌ అయ్యప్ప కాలనీలో వరద నీటి బాధితులను కేటీఆర్‌ పరామర్శించారు. వారికి 10వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. త్వరలో అధికారులు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారని, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న వాటికి 50 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. అధికారుల నివేదికను బట్టి దసరా తర్వాత సహాయం అందిస్తామన్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డే ఉన్నందున.. బండ్లగూడ చెరువు నుంచి నాగోలు చెరువు, అక్కడి నుంచి మూసీ వరకు వరద నీటిని తరలించేలా ప్రణాళికలు రూపొందించి ఇవ్వాలని సూచించారు. ఎన్ని నిధులైనా సరే తాను విడుదల చేసి వరద సమస్యల్లేకుండా చూస్తానన్నారు. లింగోజిగూడలో కేటీఆర్‌ కూడా బురద నీటిలో చిక్కుకొని కొంత ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తామని, అలా అందకపోతే కార్పొరేటర్‌ ఇంటి వద్ద ధర్నా చేద్దామని అన్నారు.  ఖైరతాబాద్‌, టోలిచౌకి, నదీంకాలనీ తదితర ప్రాంతాల్లో తలసాని, అసదుద్దీన్‌, స్థానిక ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో కలిసి కేటీఆర్‌ వరద బాధితులను పరామర్శించారు.

Updated Date - 2020-10-21T08:28:01+05:30 IST