ఇళ్ల వద్దకే సీఎం రిలీఫ్‌ కిట్లు

ABN , First Publish Date - 2020-10-18T09:26:05+05:30 IST

ముంపు ప్రాంతాల్లో బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి సీఎం రిలీఫ్‌ కిట్లు అందజేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

ఇళ్ల వద్దకే సీఎం రిలీఫ్‌ కిట్లు

బాధితులకు రూ.2,800 నిత్యావసర సరుకులు

ఒక్కో కుటుంబానికి మూడు బ్లాంకెట్ల పంపిణీ

పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టండి

వ్యాధులు, దోమల నివారణపై దృష్టి సారించండి

సమీక్షలో అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు

పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టండి

వ్యాధులు, దోమల నివారణపై దృష్టి సారించండి

సమీక్షలో అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ముంపు ప్రాంతాల్లో బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి సీఎం రిలీఫ్‌ కిట్లు అందజేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఒక్కో కిట్‌లో నెల రోజులకు సరిపడా రూ.2800 విలువైన నిత్యావసర వస్తువులతోపాటు మూడు బ్లాంకెట్లు ఉంటాయని, బాధితులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం పర్యటించిన ఆయన.. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరద బాధిత ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. దోమల నివారణకు యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని, అవసరమైతే అదనంగా వాహనాలు సమకూర్చుకోవాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో నిలిచిన నీటితోపాటు రోడ్లపై పేరుకుపోయిన బురద, భవన నిర్మాణ వ్యర్థాలు, శిథిలాలు తొలగించాలని చెప్పారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌తోపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


బ్లాంకెట్లు ఇంకా పంపలేదా?

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన కేటీఆర్‌.. అక్కడి సంచులను చూసి.. ‘ఏంటివి.. ఇంకా ఇక్కడెందుకున్నాయి..? పంపించలేదా..?’ అని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ను ప్రశ్నించారు. 35వేల బ్లాంకెట్లను ఇంకా పంపీణీ చేయాల్సి ఉందని మేయర్‌ పేర్కొనగా.. వెంటనే పంపించాలని మంత్రి సూచించారు. 


బాధిత కుటుంబాలకు పరిహారం

ఇటీవల గగన్‌పహడ్‌ అప్పా చెరువు కట్ట తె గడంతో వరదల్లో కొట్టుకుపోయి మరణించిన నాలుగు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున మంత్రి కేటీఆర్‌ అందజేశారు. అనంతరం మంత్రుల బృందం అప్పా చెరువును పరిశీలించింది. తూమును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. అంతకుముందు బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ మునిసిపాలిటీల పరిధిలోని వరద బాధితులను మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రగతినగర్‌ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయాలని  సూచించారు. పర్వతాపూర్‌ చెరువు కట్ట తెగి జలమయమైన ప్రాంతాలను సైతం కేటీఆర్‌ సందర్శించారు.


సీఎం రిలీఫ్‌ కిట్‌లో ఉండే సరుకులు

బియ్యం-5కిలోలు; పెసరపప్పు-కిలో; నూనె-500ఎంఎల్‌; కారం 200గ్రాములు; పసుపు-100 గ్రాములు; సాంబార్‌ పౌడర్‌-200 గ్రాములు; ఉప్పు-కిలో; చింతపండు-250గ్రాములు; గోదుమపిండి-కిలో; టీపౌడర్‌-100 గ్రాములు; చక్కెర-500 గ్రాములు


అన్ని రహదారులపై ట్రామా కేర్‌ సెంటర్లు: కేటీఆర్‌

శంషాబాద్‌లో ట్రామా సెంటర్‌, అంబులెన్స్‌ల ప్రారంభం


శంషాబాద్‌రూరల్‌/హైదబాద్‌సిటీ: రాష్ట్రంలోని అన్ని రహదారులపై లైఫ్‌ సపోర్టు అంబులెన్స్‌ సర్వీసులు, ట్రామా కేర్‌ సెంటర్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కిషన్‌గూడ వద్ద హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓఆర్‌ఆర్‌ ట్రామా కేర్‌ సెంటర్‌తోపాటు 10 లైఫ్‌ సపోర్టు అంబులెన్స్‌లను మంత్రి సబితారెడ్డితో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ఓఆర్‌ఆర్‌ వెంట ట్రామాకేర్‌ సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. ‘వరల్డ్‌ ట్రామా డే’ రోజున ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇలాంటి సేవలను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. 

Updated Date - 2020-10-18T09:26:05+05:30 IST