స్థలాల సమస్యలకు శాశ్వత పరిష్కారం

ABN , First Publish Date - 2020-09-27T09:50:43+05:30 IST

స్థలాల సమస్యలకు శాశ్వత పరిష్కారం

స్థలాల సమస్యలకు శాశ్వత పరిష్కారం

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌ హామీ 


కాప్రా, సెప్టెంబర్‌26 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు సంబంధించిన స్థలాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హామీనిచ్చారు. హెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని మల్లాపూర్‌ నోమా ఫంక్షన్‌ హాల్లో  ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీల వాసులతో శనివారం ఆయన రెవెన్యూ సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థలాలకు సంబంధించిన సమస్యలను పలువురు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాప్రా జైజవాన్‌ కాలనీలో 330 మంది ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌కు 1989లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని అయితే వీటి రిజిస్ర్టేషన్‌లు జరగకపోవడంతో అమ్మకం, కొనడం చేయలేకపోతున్నారని, బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారని, కాలనీ అసోసియేషన్‌ అధ్యక్షుడు తిరుమలయ్య మంత్రికి వివరించారు.


చర్లపల్లి నవోదయనగర్‌ ఇండస్ర్టియల్‌ అసోసియేషన్‌ స్థలాలను 2008లో హుడా మాస్టర్‌ ప్లాన్‌లో మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌లో చేర్చారని, దీని వల్ల ఇటు జీహెచ్‌ఎంసీ  అటు ఐలా ఇళ్ల నిర్మాణానికి, పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం లేదని అసోసియేషన్‌ ప్రతినిధి ఆనంద్‌కుమార్‌ మంత్రికి వివరించారు. మింట్‌ ఉద్యోగులు నివాసముంటున్న చర్లపల్లి న్యూమింట్‌ కాలనీని ఇండస్ర్టియల్‌ జోన్‌లో చూపుతున్నారని, దీనివల్ల ఎలాంటి అనుమతులురావడం లేదని వార్డు కమిటీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి మంత్రికి తెలిపారు. చర్లపల్లిలోని 142 ఎకరాలలో బీఎన్‌రెడ్డినగర్‌ ఉందని, ఇందులోని 20 శాతం ప్లాట్లు యూఎల్‌సీ పరిధిలో ఉన్నాయంటూ ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎ్‌సలకు అధికారులు అనుమతించడం లేదని, ఇండస్ర్టియల్‌ జోన్‌లో ఉన్న ఆఫీసర్స్‌ కాలనీని, ఉప్పల్‌ లక్ష్మీనారాయణ కాలనీని రెసిడెన్షియల్‌ జోన్‌లోకి మార్చాలని పలువురు కోరారు.


ఉప్పల్‌ రామంతాపూర్‌లోని భగాయత్‌ భూముల్లో 830 ఎకరాలకు 2005లో అధికారులు ల్యాండ్‌ అక్విజేషన్‌ నోటీసులు ఇచ్చారని, దీని వల్ల ఇప్పటికే ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్న పేదలకు అన్యాయం జరుగుతోందని నోటీసులను రద్దు చేసి ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ అనుమతుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చూడాలని పలువురు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్యలకు సంబంధించిన పూర్తి ఆధారాలను, డాక్యుమెంట్లను తీసుకుని రెండురోజుల్లో తన వద్దకు రావాలని ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డిని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభా్‌షరెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌, సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ శైలజ, వివిధ డివిజన్‌ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-27T09:50:43+05:30 IST