హైదరాబాద్‌ అభివృద్ధికి రూ. 67 వేల కోట్లు

ABN , First Publish Date - 2020-09-17T08:32:27+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధి కోసం రూ.67,135 కోట్లు వ్యయం చేసిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రెవెన్యూ వ్యయం, ఇతరత్రా ఖర్చులు కలిపితే

హైదరాబాద్‌ అభివృద్ధికి  రూ. 67 వేల కోట్లు

  • టీఆర్‌ఎస్‌ ఆరేళ్లలో చేసిన ఖర్చు ఇది..
  • డబుల్‌ ఇళ్లకే దాదాపు పది వేల కోట్లు
  • డిసెంబరుకు అందుబాటులో లక్ష ఇళ్లు
  • మూడేళ్లలో పాతబస్తీకి మెట్రో: కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధి కోసం రూ.67,135 కోట్లు వ్యయం చేసిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రెవెన్యూ వ్యయం, ఇతరత్రా ఖర్చులు కలిపితే లక్ష కోట్లకుపైగా ఉంటుందన్నారు. అంతకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పదేళ్లలో (2004-2014) చేసిన ఖర్చు కేవలం రూ.4,636 కోట్లు మాత్రమేనని చెప్పారు. ుూఓఆర్‌ఆర్‌ కోసం పదేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.3,800 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేళ్లలో 3400 కోట్లు వెచ్చించింది. మెట్రో వాటర్‌ బోర్డు ద్వారా కాంగ్రెస్‌ 3,575 కోట్లు.. టీఆర్‌ఎస్‌ 5,683 కోట్లు వ్యయం చేశాయి. మెట్రో రైలు కోసం కాంగ్రెస్‌ రూ.5,081 కోట్లు ఖర్చు చేయగా టీఆర్‌ఎస్‌ రూ.17,291 కోట్లు ఖర్చు చేసింది’’ అని వివరించారు. వీధి కుక్కలు, పందులు లేకుండా చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. 11 వేల టాయ్‌లెట్లను నిర్మించినట్టు పేర్కొన్నారు. ుూరాష్ట్ర ప్రభుత్వం 18 వేల కోట్లతో పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తోంది. కేవలం గ్రేటర్‌లోనే ఇళ్ల నిర్మాణం కోసం 9,714 కోట్లు ఖర్చు చేస్తోంది. డిసెంబరు నెలాఖరుకు లక్ష ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇళ్ల నిర్మాణానికి ఏ రాష్ట్రం ఇంత భారీ ఎత్తున ఖర్చు చేయడం లేదు.


ముంబైలో 1590 కోట్లు; కోల్‌కతాలో 22 కోట్లు, చెన్నైలో 1961 కోట్లు వ్యయం చేస్తుండగా హైదరాబాద్‌లో 9,714 కోట్లతో గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తున్నాం’’ అని వివరించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపడుతూ ప్రశంసల వర్షం కురిపిస్తుంటే కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క మాత్రం ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారని మండిపడ్డారు. అంబేడ్కర్‌ను పార్లమెంటులో అడుగు పెట్టకుండా అప్పటి కాంగ్రెస్‌ చేసిందని, తాము మాత్రం బోరబండలో దళిత్‌ స్టడీస్‌ ఆవరణలో 28 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, టాంక్‌బండ్‌ సమీపంలో 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పాతనగరం అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందని చెప్పారు. మరో మూడేళ్లలో పాతనగరంలో మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు.


గాంధీ భవన్‌కు టూలెట్‌ బోర్డు

హైదరాబాద్‌ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు వస్తున్నాయని, అందుకే కాంగ్రెస్‌ నాయకులకు కళ్ల మంటగా ఉందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. పెట్టుబడులు రావడంతో అనేక మందికి ఉపాధి లభిస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ నాయకులకు ఉపాధి లేకుండా పోయిందని, గాంధీ భవన్‌ను ఖాళీ చేసి టూ లెట్‌ బోర్డు పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.


67 వేల కోట్లు ఏం చేశారు!?: భట్టి

హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.67 వేల కోట్లను ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోందని, కానీ, ఆ స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదని, ఆ డబ్బులు ఎక్కడికి పోయాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో తక్కువ ఖర్చుతోనే మెరుగైన అభివృద్ధి జరిగిందన్నారు. ుూఈ ప్రభుత్వం తమ సమస్యలపై ప్రజలను ధర్నాలు చేయనివ్వడం లేదు. ధర్నా చౌక్‌ను కూడా ఎత్తివేశారు? పోలీసులు కట్టడి చేయకపోతే రోజూ వందల ధర్నాలు జరుగుతాయి. రాష్ట్రంలో చౌక్‌ లేదు. ప్రజాస్వామ్యమూ లేదు’’ అని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని చెత్తబుట్టలో వేయడం న్యాయమా? అని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ పట్ల కాంగ్రెస్‌ పార్టీకి గౌర వం ఉన్నందునే  రాజ్యాంగం రాయడానికి అవకాశం కల్పించిందని, ఆ రాజ్యాంగం కారణంగానే చిన్న రాష్ర్టాల ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. గాంధీ భవన్‌ కారణంగానే తెలంగాణ రాష్ట్ర సిద్ధించిందని భట్టి అన్నారు. 


జీరో అవర్‌లో ఎమ్మెల్యేలు..

చందంపేట మండలంలో మూడు లిఫ్టులు ఏర్పాటుచేయాలని, డిండి ద్వారా చెరువులు, కుంటలు నింపాలని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, పంటలను దెబ్బతీస్తున్న పందులను చంపే అధికారం రైతులకు ఇవ్వాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరారు. గర్శకుర్తి, బూర్గుపల్లిలను మండలాలుగా ప్రకటించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ఆర్మూరు వంద పడకల ఆస్పత్రిలో సౌకర్యాలు పెంచాలని, వైద్యులను నియమించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా సందర్భంగా సీజ్‌ చేసిన వాహనాలు, డాక్యుమెంట్లు వాహనదారులకు తిరిగి ఇవ్వాలని ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌; కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురైన వేములపల్లి మండలంలోని ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. కరోనా సందర్భంగా విశిష్ట సేవలందించిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌; బోయలు, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎమ్మెల్యే అబ్రహం; వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతు చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కోరారు. 

Updated Date - 2020-09-17T08:32:27+05:30 IST