ఎల్‌ఆర్‌ఎస్‌ ఊరట

ABN , First Publish Date - 2020-09-17T07:35:53+05:30 IST

అనధికార, అక్రమ ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ముందుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు భారీ ఊరట! వారికి చార్జీలు గణనీయంగా తగ్గనున్నాయి! ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఎల్‌ఆర్‌ఎస్‌ ఊరట

భారం తగ్గింపునకు సర్కారు నిర్ణయం

2015 నాటి నిబంధనలే ఇప్పుడు కూడా

ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువ 

వర్తింపు.. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ 

భారీగా మారనున్న శ్లాబులు, చార్జీలు

దరఖాస్తుదారులకు తగ్గనున్న భారం

త్వరలోనే 3,456 వార్డు ఆఫీసర్‌ పోస్టుల భర్తీ

మూడేళ్ల ప్రొబేషన్‌ తర్వాత క్రమబద్ధీకరణ

వార్డు కార్యాలయాలనూ ఏర్పాటు చేస్తాం

ఓఆర్‌ఆర్‌పై ఫుడ్‌ కోర్టులు, రెస్ట్‌ రూంలు

శాసన మండలిలో మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అనధికార, అక్రమ ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ముందుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు భారీ ఊరట! వారికి చార్జీలు గణనీయంగా తగ్గనున్నాయి! ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇదే విషయాన్ని మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు కూడా! పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్థిక భారం పడకుండా రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగానే భూముల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) చేసే విధంగా జీవోను సవరించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జీవో 131ను సవరిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. శాసన సభలో బుధవారం జీహెచ్‌ఎంసీ, పరిసర మునిసిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనపై స్వల్ప వ్యవధి ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఎల్‌ఆర్‌ఎ్‌సపై ఒకవేళ ప్రభుత్వం పొరపాటుగా నిర్ణయం తీసుకుని ఉంటే, ఇప్పుడు సవరించుకునే ఆస్కారం ఉందంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలనే తీసుకుంటుందని, రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉన్న ధర ప్రకారమే క్రమబద్ధీకరణ చార్జీలనూ వసూలు చేస్తామని చెప్పారు.


సెప్టెంబరు 1న ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ దరఖాస్తుదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. లక్షల్లో చార్జీలను చెల్లించాల్సి రావడంపై దరఖాస్తుదారులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోను సవాల్‌ చేస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు కూడా. ప్లాటు విస్తీర్ణం పెద్దగా ఉండి, మార్కెట్‌ విలువ పెరిగిన చోట రూ.10 లక్షలకుపైగా కూడా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితులున్నాయి. దీంతో, చార్జీల భారంపై ప్రజల్లోని అసంతృప్తిని పసిగట్టిన ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలను సవరించాలని, భారం తగ్గించాలని నాలుగైదు రోజులుగా కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రతిపక్షాలతోపాటు పలువురు అధికార పార్టీ సభ్యులు కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ భారాన్ని తగ్గించాలని కోరడంతో ఆ వెంటనే మంత్రి కేటీఆర్‌ ప్రకటన చేయడం జరిగింది. 


2015 నాటి ఉత్తర్వులే ప్రాతిపదిక

ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు కొంత మేలు జరగనుంది. మంత్రి కేటీఆర్‌ ప్రకటన ప్రకారం 2015లో జారీ చేసిన ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలనే ఇప్పుడు కూడా వర్తింపజేయనున్నారు. రిజిస్ర్టేషన్‌ చేసుకున్న నాటి మార్కెట్‌ విలువ ప్రకారమే చార్జీలనూ ఖరారు చేస్తారు. అంతేనా, క్రమబద్ధీకరణ చార్జీలకు ప్రస్తుతం నిర్ణయించిన స్లాబుల్లోనూ మార్పులు రానున్నాయి. ఐదేళ్ల కిందట జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏడు స్లాబులు ఉండగా.. తాజా ఉత్తర్వుల్లో నాలుగు స్లాబులు మాత్రమే ఉన్నాయి. స్లాబుల్లో మార్పు కారణంగా బేసిక్‌ విలువపై క్రమబద్ధీకరణ చార్జీలు భారీగా తగ్గనున్నాయి. సవరణ ఉత్తర్వుల్లో కటాఫ్‌ తేదీతో సంబంధం లేకుండా రిజిస్ర్టేషన్‌ జరిగిన నాటి మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో, బేసిక్‌ విలువ/ స్లాబుల్లో మార్పులు లేకపోయినా.. క్రమబద్ధీకరణ కోసం పరిగణనలోకి తీసుకునే మార్కెట్‌ విలువ, స్లాబుల కారణంగా చార్జీల భారం తగ్గనుంది.


ఉదాహరణకు, ఓ వ్యక్తి హయత్‌ నగర్‌లో 2010లో 200 చదరపు గజాలు కొనుకున్నాడు. అప్పట్లో అక్కడ మార్కెట్‌ విలువ రూ.2800 అనుకుందాం. దాని ప్రకారమే రిజిస్ట్రేషన్‌ జరిగింది. కానీ, ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోలేదు. ఇప్పుడు ఆ ప్రాంతంలో మార్కెట్‌ విలువ రూ.5100కు పెరిగింది. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. 167 చదరపు మీటర్ల (200 చదరపు గజాలు)కు ఒక్కో మీటర్‌కు రూ.400 చొప్పున రూ.66,800 బేసిక్‌ విలువ అవుతుంది. అందులో 50 శాతం అంటే రూ.33,400 కేవలం క్రమబద్ధీకరణ చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. అదే, 2015 జీవో ప్రకారం క్రమబద్ధీకరణ చేస్తే.. అతను కేవలం రూ.13,360 కడితే సరిపోతుంది. దాంతో, సదరు దరఖాస్తుదారుడికి కేవలం క్రమబద్ధీకరణ చార్జీల్లోనే రూ.20 వేల వరకూ ఆదా అవుతుంది. 



Updated Date - 2020-09-17T07:35:53+05:30 IST