మైనారిటీ స్టడీ సెంటర్లలో ఉచిత కోచింగ్ నిర్వహించండి: మంత్రి కొప్పుల

ABN , First Publish Date - 2022-04-18T23:18:48+05:30 IST

రాష్ట్రంలో ఖాళీగా వివిధ ప్రభుత్వోద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పోటీ పరీక్షలకు యువతను సంసిద్ధం చేసేందుకు మైనారిటీ స్టడీ సెంటర్లలో ఉచితంగా కోచింగ్ ఇప్పించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు

మైనారిటీ స్టడీ సెంటర్లలో ఉచిత కోచింగ్ నిర్వహించండి: మంత్రి కొప్పుల

హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా వివిధ ప్రభుత్వోద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పోటీ పరీక్షలకు యువతను సంసిద్ధం చేసేందుకు మైనారిటీ స్టడీ సెంటర్లలో ఉచితంగా కోచింగ్ ఇప్పించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.ఈ విషయమై మంత్రి తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సోమవారం సమీక్ష జరిపారు.రాష్ట్రంలో 81వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండగా, వీటిలో మైనారిటీ సంక్షేమ శాఖలో 76, మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో 1445 ఖాళీలు ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.మైనారిటీ సంక్షేమ శాఖలో గ్రూపు -1కేటగిరిలో జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి 6, గ్రూపు -2కేటగిరిలో 10 సహాయ సంక్షేమాధికారి, హౌస్ సంక్షేమాధికారి 15, జూనియర్ అసిస్టెంట్లు 28,అక్కౌంటెట్లు 4,ఉర్థూ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.


అదేవిధంగా మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో 1445 పోస్టులు ఖాళీలు ఉండగా, వీటిలో 594టిజిటి,414జూనియర్ లెక్చరర్లు,200 లైబ్రేరియన్లు,127స్టాఫ్ నర్సులు,60ఫిజికల్ డైరెక్టర్లు,38క్రాఫ్ట్ టీచర్లు,12 పిఇటి ఖాళీలు ఉన్నట్లు మంత్రి కొప్పులకు అధికారులు తెలిపారు.గురుకులాల ఉద్యోగాలను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల మండలి (TREIB ) ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రికి అధికారులు వివరించారు.ఈ ఉద్యోగ ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు జారీ కానున్నందున యువతకు ఆ యా విషయాలలో నిపుణులతో ఉచితంగా అత్యుత్తమ కోచింగ్ ఇప్పించేందుకు విధి విధానాలు రూపొందించి,తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు మంత్రి సూచనలు చేశారు.గ్రూపు1,2,3 పోస్టుల కోసం ఉమ్మడి 10 జిల్లాలలోని మైనారిటీ స్టడీ సెంటర్లలో, గ్రూపు-4 పోస్టులకు గాను 33జిల్లా కేంద్రాలలో కోచింగ్ ఇవ్వాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.ఇందుకు రంజాన్ మాసం, పర్వదినం తర్వాత కోచింగ్ ఇప్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఈశ్వర్ కోరారు.

Updated Date - 2022-04-18T23:18:48+05:30 IST