పదో తరగతి విద్యార్ధుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపండి- కొప్పుల

ABN , First Publish Date - 2020-05-29T23:54:56+05:30 IST

లాక్‌డౌన్‌ వల్ల వాయిదా పడ్డ పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తేదీలను ప్రకటించించిన నేపధ్యంలో రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్ధులను పరీక్షలకు సిద్ధం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులకు సూచించారు

పదో తరగతి విద్యార్ధుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపండి- కొప్పుల

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ వల్ల వాయిదా పడ్డ పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తేదీలను ప్రకటించించిన నేపధ్యంలో రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్ధులను పరీక్షలకు సిద్ధం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆశ్రమ పాఠశాలల్లో ఉన్న విద్యార్ధుల గురించి తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి సాంఘిక సంక్షేమ, మైనారిటీ సంక్షేమ విద్యాసంస్థల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన పదోతరగతి పరీక్షలు వచ్చే నెల 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నందున విద్యార్ధులందరూ సంబంధిత ఆశ్రమ పాఠశాలలకు ఈనెల జూన్‌ 1న చేరుకుంటారని అన్నారు. వారి ఆరోగ్య పరిరక్షణ గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉందన్నారు.


లాక్‌డౌన్‌ సమయంలో నిర్వహించిన ఆన్‌లైన్‌ క్లాసులు విద్యార్ధులకు చాలా లబ్ధి చేకూరిందన్నారు. విద్యార్ధులు అద్భుతప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల అందరూ ఆందోళనలో ఉన్నందున సంబంధిత ప్రిన్సిపాల్‌, స్టాఫ్‌ నర్సులు, విద్యార్ధులు  కోవిడ్‌-19 రాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, సామాజిక దూరం మొదలైన వాటి గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పాఠశాల ప్రాంగణంలో ఽథర్మల్‌ స్ర్కీనింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్ధులకు మాస్క్‌లు, శానిటైజర్లు అందించాలన్నారు. అలాగే వారికి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని అన్నారు. 


ప్రత్యేకించి విద్యార్ధులు మానసిక ఆందోళనకు గురికాకుండా చదువుపైనే దృష్టిపెట్టేలా చూడాలని సూచింరారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ విద్యాసంస్థల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, మాట్లాడుతూ 173 పాఠశాలల్లో 12,163 విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. వారిలో 4155 మంది బాలురు, 7988 మంది బాలికలు ఉన్నారని అన్నారు. మంత్రి ఆదేశాల మేరకు అన్నిచర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2020-05-29T23:54:56+05:30 IST