ఈటలపై మంత్రి కొప్పుల సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-05-04T18:19:44+05:30 IST

గత నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపించిన పేరు ‘ఈటల’.

ఈటలపై మంత్రి కొప్పుల సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ : గత నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపించిన పేరు ‘ఈటల’. మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్ బర్త్‌రఫ్ చేయడం, ఆ తర్వాత ఆయన వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టడంతో ఈ ‘భూ’వ్యవహారం మరింత ముదిరింది. అయితే ఈటల ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించిన పలు విషయాలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల ఆరోపణలు సత్యదూరం. ఈటలకు పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఈటల ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదు. మూడు, నాలుగేళ్లుగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన ఒక్కడి వల్లే అంతా జరిగినట్లు ఈటల మాట్లాడుతున్నారు. ఇది క్రమశిక్షణ కాదు.. ఈటల వ్యవహారం అధిష్టానం దృష్టిలో ఉంది. అనేక రకాలుగా ఈటల పార్టీ నుంచి లబ్ధి పొందారుఅని కొప్పల వ్యాఖ్యానించారు.


ఈటలపై ప్రశ్నల వర్షం..

ఈటల సీఎంపై విమర్శలు చేయడం శోచనీయం. ఈటల పార్టీలో చేరే నాటికే ఉద్యమం ఉధృతమైంది. వారు పార్టీలో చేరక ముందే హుజూరాబాద్‌లో పార్టీ బలంగా ఉంది. ఈటలను మొదటి నుంచి పార్టీ గౌరవించింది. 21మంది టికెట్లు ఆశించినా పార్టీ ఆయనకు పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఫ్లోర్ లీడర్‌గా, మంత్రిగా ఈటలకు అత్యంత గౌరవం దొరికింది. ఎక్కడ ఆత్మగౌరవం దెబ్బ తిన్నదో అర్థం కావడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌పై, పార్టీపై ఇష్టానుసారం మాట్లాడటం క్రమశిక్షణ ఉల్లంఘనే. తాను లేకుండా ఏదీ లేదన్నట్లు ఈటల మాట్లాడటం సరికాదు. ప్రభుత్వ విధానాలను కూడా వ్యతిరేకించేలా మాట్లాడారు. అసైన్డ్ భూములను కొన్నానని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. దళిత, పేద వర్గాల గురించి మాట్లాడే మీరు అసైన్డ్ భూములు కొనడం తప్పని తెలియదా..?. మీ సంస్థ ప్రజావసరాల కోసం కాదు కదా.. మీకెలా అసైన్డ్ భూములు ఇస్తారు..?. వాళ్లకు అవసరం ఉండి అమ్ముకున్నా మీరు ఎలా కొంటారు..?. మీ వ్యాపార అభివృద్ధి తప్పా.. దళితుల సంక్షేమం పట్టదా..?. మీరు ఇందులో ఇరుక్కుని దేవరాయాంజల్‌లో దేవాలయాల భూములని తెలిసి ఎలా కొన్నారు..?. మీ మీద ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తే సమాధానం చెప్పాలి. అలా కాకుండా కేసీఆర్ మీద ఆరోపణలు ఎలా చేస్తారు?. మీరు పార్టీని విచ్చిన్నం చేసేలా ఎందుకు మాట్లాడుతున్నారు..?. మీకు మీరు అతిగా ఊహించుకుని మాట్లాడటం సరికాదు. సీఎం పై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. మీరు తప్పు చేసి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మంచిది కాదుఅని ఈటలపై కొప్పుల ప్రశ్నల వర్షం కురిపించారు.


రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ..

కాగా ప్రస్తుతం ఈటల తన సొంత నియోజకవర్గంలో ఉన్నారు. ఈటల క్యాంప్ కార్యాలయానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈటల అందరితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. మరోవైపు.. ఇవాళ సాయంత్రం తన పార్టీ సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈటల ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్‌పై పోరుకు ఈటల రాజేందర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 


Updated Date - 2021-05-04T18:19:44+05:30 IST