మంత్రి అలా... శాఖ ఇలా

ABN , First Publish Date - 2020-03-26T07:52:39+05:30 IST

రేషన్‌ పంపిణీపై పౌరసరఫరాల శాఖ ఒక విధంగా ఆదేశాలు ఇస్తే.. ఆ శాఖ మంత్రి కొడాలి నాని అందుకు విరుద్ధంగా మరొక ...

మంత్రి అలా... శాఖ ఇలా

రేషన్‌ పంపిణీపై విరుద్ధ ప్రకటనలు

షాపుల్లోనే పంపిణీ: పౌరసరఫరాల శాఖ

ఇంటికే రేషన్‌: మంత్రి కొడాలి నాని

అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రేషన్‌ పంపిణీపై పౌరసరఫరాల శాఖ ఒక విధంగా ఆదేశాలు ఇస్తే.. ఆ శాఖ మంత్రి కొడాలి నాని అందుకు విరుద్ధంగా మరొక ప్రకటన చేశారు. కార్డుదారులు రేషన్‌ షాపుల వద్దకు వచ్చి ఎప్పటిలాగే సరుకులు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కార్యాలయం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేసింది. అయితే దానిపై మంత్రి కొడాలి నాని బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లే ఇళ్లకు తీసుకొచ్చి రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తారని, ఈపోస్‌ బయోమెట్రిక్‌ విధానాన్ని కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో రేషన్‌ డీలర్లు అయోమయంలో పడిపోయారు. ఆ శాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాలు పాటించాలా? లేక మంత్రి చెప్పినట్లు చేయాలా? అనే విషయం అర్థంకాక గందరగోళంలో ప డిపోయారు. కాగా డీలర్లు మాస్కులు ధరించి, చేతులు శానిటైజర్లతో శు భ్రం చేసుకుని రేషన్‌ పంపిణీ చేయాలని మంగళవారం ఇచ్చిన ఆదేశాల్లో ఆ శాఖ కమిషనర్‌ కార్యాలయం స్పష్టంచేసింది. కార్డుదారులు కూడా మాస్కులు ధరించాలని సూచించింది.


షాపుల వద్ద చేతులు శుభ్రం చేసుకోడానికి సబ్బులు లేదా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. కార్డుదారులు క్యూలో రెండు మీటర్లు దూరం ఉండేలా మార్కింగ్‌ చేయాలని ఆదేశించింది. కార్డుదారులు కాకుండా ఇతర వ్యక్తులను షాపుల వద్ద ఉండనీయవద్దని, కుటుంబం నుంచి ఒక్కరినే సరుకుల కోసం అనుమతించాలని స్పష్టం చేసింది. ఈనెల 29 నుంచి ఏప్రిల్‌ 15 వరకు పంపిణీ చేయాలని తెలిపింది. కాగా, వేలిముద్రల ద్వారా కరోనా సోకే ప్రమాదం ఉన్నందున ఎవరైనా అధికారులు వేలిముద్ర వేసినా సరుకులు ఇచ్చే విధానానికి పౌరసరఫరాల శాఖ అంగీకారం తెలిపింది. కాగా, రేషన్‌ షాపులకు శుభ్రత గురించి ఆదేశాలు ఇచ్చినా, దానికి సంబంధించి ఎలాంటి వస్తువులు ఇవ్వకపోవడంపై డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డీలర్లకు కనీసం మాస్కులు కూడా ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. వందల మంది సరుకుల కోసం తమ వద్దకు వస్తారని, వారందరికీ వ్యక్తిగత నగదుతో శానిటైజర్లు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా అని అడుగుతున్నారు.  

Updated Date - 2020-03-26T07:52:39+05:30 IST