పీయూష్ గోయలే ఒక వ్యాపారి: మంత్రి జగదీశ్వర్ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-23T01:01:16+05:30 IST

బీజేపీ, కాంగ్రెస్ నేతలపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి

పీయూష్ గోయలే ఒక వ్యాపారి: మంత్రి జగదీశ్వర్ రెడ్డి

ఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్ నేతలపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయలే ఒక వ్యాపారి అని ఆయన అన్నారు. ఆయన వ్యాపారులకు ప్రతినిధి అని ఆరోపించారు. వారికి వ్యాపార ప్రయోజనాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టవన్నారు. పీయూష్ గోయల్‌కు రైతుల ప్రయోజనాలు తెలియదన్నారు. రైతులను బీజేపీ పట్టించుకోదన్నారు. ధాన్యం కోనుగోలు అంశంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 40 లక్షల మెట్రిక్ టన్నులను మించి సేకరిస్తాం అని కేంద్రం చెబుతోందన్నారు. మరి  ఎఫ్‌సీఐ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే రాత పూర్వకంగా చెప్పాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.


ఏ రాష్ట్రంలో లేనిది, తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని అడుగుతున్నారని, తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంతగా పంట పండిందని ఆయన తెలిపారు. అందుకే అదనపు కొనుగోళ్లు చేయాలని కేంద్రాన్ని తాము కోరుతున్నామన్నారు. 40 లక్షల టన్నుల బియ్యానికి అగ్రిమెంట్ జరిగిందన్నారు. తాము మిల్లు పట్టి ఇస్తే కేంద్రం తీసుకోవాలన్నారు. అయితే ఈ టార్గెట్ పూర్తయిందన్నారు.  ఇంకా మార్కెట్ యార్డుల్లో, పంట కల్లాల్లో, కోతలు ఇంకా పూర్తికాని వరి ఉందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతలు బొక్కబోర్లా పడడం ఖాయమన్నారు. కేసీఆర్ నుంచి రైతాంగాన్ని విడదీయడం బీజేపీకీ సాధ్యం కాదన్నారు. రెండ్రోజుల్లో చెబుతాం అన్నారు కాబట్టే తాము ఢిల్లీలో ఆగామన్నారు. ఉత్తరం ఇస్తే తామెందుకు ఢిల్లీలో ఉంటామన్నారు. ఇస్తే వెళ్లిపోయేవాళ్ళం కదా అని అయన అన్నారు. 



రాజకీయ ప్రయోజనాలే..

రాజకీయ ప్రయోజనాల తప్ప రైతుల ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదన్నారు. ఎవరు రైతుల కోసం పని చేస్తున్నారో, ఎవరు చేయడం లేదనే విషయాన్ని తెలంగాణ సమాజం చూస్తోందన్నారు. 40 లక్షల టన్నుల బియ్యానికి ఎంవోయూ చేసినోళ్లు, అదనపు సేకరణపై లెటర్ ఇవ్వడానికి ఏమైందన్నారు. ఎందుకు ఇవ్వడం లేదో వాళ్లే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మిల్లు పట్టి బియ్యం రెడీ చేసి ఉంచామన్నారు. బియ్యాన్ని తీసుకెళ్ళాల్సిన బాధ్యత వారిదేనన్నారు. రైల్వేనే వారిదని, తీసుకెళ్లకుండా తాత్సారం చేస్తున్నది వాళ్ళేనని ఆయన పేర్కొన్నారు. 


2014 తర్వాత వ్యవసాయం రంగం ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో చెప్పాలన్నారు. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఎన్నికల మాట మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. రైతుల అంశంలో ఎన్నికలకు ఏం సంబంధమన్నారు. రైతుల నుంచి తన్నులు తప్పించుకునేందుకే విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రైతులను శత్రువులుగా చూసే పార్టీ బీజేపీ అని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా చెప్పినట్టే లేఖ ఇవ్వాలని తాము అడుగుతున్నామన్నారు.శాసనం ఆయినా కాగితంలోనే పెట్టాలని ఆయన అన్నారు. 



 కాంగ్రెస్ ఓ చిల్లర పార్టీ..

రూ. 16,000 కోట్ల కుంభకోణం అంటున్న కాంగ్రెస్ నేతలు అసలు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓ చిల్లర పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఓ నాయకుడు లేడు.. ఏం లేడన్నారు. కాంగ్రెస్ కూడా బీజేపీకీ తోక పార్టీలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 



Updated Date - 2021-12-23T01:01:16+05:30 IST