నల్గొండ : దేశంలోనే భరోసా కేంద్రం తొలి ప్రయోగమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన భరోసా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో భరోసా కేంద్రానికి వచ్చే వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నూతన పద్ధతుల్లో పాలన సాగిస్తున్నారని కొనియాడారు. సమర్థులైన అధికారుల ఎంపికతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పక్కాగా అమలవుతున్నాయని చెప్పారు. నేరాల అదుపునకు ఇతర రాష్ట్రాలు.. తెలంగాణ పోలీసుల సహకారం తీసుకోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.
డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొదటగా షీ టీం తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటైందన్నారు. నేరం జరగకుండా చూడడమే పోలీస్ శాఖ ప్రథమ లక్ష్యమని చెప్పారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పొలీసులతో సమానమని.. రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో తొమ్మిది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏదైనా సంఘటన జరిగిన పది నిమిషాల్లోనే పోలీసు వాహనం అక్కడికి చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.